KCR వేతన వివరాలు బయటపెట్టిన CM.. స్పీకర్‌కు షాకింగ్ కంప్లైంట్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడిచింది.
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడిచింది. మొదటి రోజు గవర్నర్ ప్రసం గంతో సమావేశాలు ప్రారంభం కాగా.. ఆ వెంటనే వాయిదా పడ్డాయి. అయితే.. ఆ తరువాత నిర్వహించిన రెండు రోజుల సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది. సభలోనే ఉండి.. ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై.. ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి వాకౌట్ బాట పట్టడం చర్చనీయాంశమైంది. వరుసగా రెండు రోజుల సమావేశాల్లోనూ బీఆర్ఎస్ సభ్యులు ఇదే ధోరణితో వ్యవహరించారు.
రెండో రోజూ సభ నుంచి బయటకు..
ఈనెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు గవర్నర్ ప్రసంగం చేసిన వెంటనే సమావేశాలు వాయిదా పడ్డాయి. 13న సమావేశం నిర్వహించగా.. ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పట్ల ఏకవచనంతో మాట్లాడారని కాంగ్రెస్ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు జగదీశ్‌రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ వేటు వేశారు. దాంతో స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే వాకౌట్ చేసి సభ నుం చి వెళ్లిపోయారు. ఇక.. శనివారం నాటి సమావేశాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయిం ది. గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు చెప్పేందుకు సిద్ధం అయిన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు వెంటనే సభను వదిలి వెళ్లిపోయారు.
శాసనమండలిలోనూ సేమ్ సీన్
అటు శాసనమండలిలోనూ బీఆర్ఎస్ సభ్యుల వ్యవహారం ఇలానే ఉంది. శనివారం సభ ప్రారంభం కాగా.. ఉదయం వేళ వాకౌట్ చేసి పసుపు మద్దతు ధర కోసం డిమాండ్ చేశారు. ఇక సాయంత్రం సైతం సీఎం రేవంత్‌రెడ్డి మండలికి చేరుకోగానే బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు హోరెత్తాయి. కేసీఆర్ మీద చేసిన కామెంట్స్‌కు వెంటనే సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే సభ నుంచి వాకౌట్ చేశారు.
సమస్యలపై నిలదీసేదెప్పుడు..?
ప్రతిపక్షం అంటేనే ప్రజల వైపు నిలబడి.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అందులోనూ అసెంబ్లీ సమావేశాలు మరింత అడ్వాన్‌టేజీ. ఎందుకంటే.. ఇరుపక్షాల సభ్యులు ఒక్కచోటే కలుస్తారు. దాంతో అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రజల సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రతిపక్షం నిలదీసే వెసులుబాటు ఉంటుం ది. కానీ.. బీఆర్ఎస్ సభ్యులు మాత్రం ప్రజా సమస్యలను పక్కన పెట్టి సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. నిత్యం వాకౌట్‌లతో సభ నుంచి బయటకు వెళ్లిపోతే ఇక వీరు ప్రజా సమస్యలపై చర్చించేది ఎప్పుడున్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు వీరికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉందా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారా? అని ప్రచారం జరుగుతోంది.
15 నెలలు.. రూ.57 లక్షల జీతం..
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి 15 నెలలు గడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారు. అయితే.. ప్రజల్లోకి రాకపోవడం ఒక ఎత్తయితే.. ఆయన 15 నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరుకావడం చర్చకు దారితీ సింది. సీనియర్ నేత, పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవాన్ని సమావేశాలకు వచ్చి తమతో పంచుకోవాలని సీఎం రేవంత్ కోరుతున్నప్పటికీ ఆయన మాత్రం రావడం లేదు. అయితే.. ఈ సమావేశాలకైనా ఆయన రెగ్యులర్‌గా వస్తారని ముందుగా ప్రచారం జరిగింది.
కానీ.. ఎప్పటిలాగే ప్రారంభం రోజు మాత్రమే వచ్చి గవర్నర్ ప్రసంగం వినేసి వెళ్లిపోయారు. మరుసటిరోజు నుంచి ఆయన సమావేశాలకు రావడం లేదు. ఇదిలా ఉండగా.. 15 నెలల కాలంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రూ.57,84,124 జీతం తీసుకున్నారని, అయినా రెండుసార్లే అసెంబ్లీకి హాజరయ్యారని తాజాగా సీఎం లెక్కలు బయటపెట్టారు. ఇప్పటికే అసెంబ్లీకి గైర్హాజరు అవుతుండడంతో ఆయన వేతనాన్ని రికవరీ చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు సైతం వెళ్లింది. మరోవైపు.. సోమ, మంగళవారాల్లో బీసీ రిజ ర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ జరగబోతున్నది. 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వీటికైనా హాజరవుతారా? లేదా? అన్న చర్చ నడుస్తోంది.