రాజకీయ నేతల విమర్శలు రెచ్చగొట్టేలా ఉండకూడదు : మంత్రి పొన్నం ప్రభాకర్

రాజకీయ నేతల భాష హద్దులు దాటొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Update: 2024-10-13 15:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయ నేతల భాష హద్దులు దాటొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాజకీయాల్లో హుందాతనం వచ్చేలా పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. గడిచిన పదేళ్లుగా రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని, ఒక పార్టీని చూసి మరో పార్టీ హద్దులు దాటి వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. విమర్శలూ రెచ్చగొట్టేలా ఉండకూడదని నొక్కి చెప్పారు. అలయ్ బలయ్ లాంటి వేదికలు రాజకీయాల్లో మార్పులు కోసం చొరవ చూపుతాయన్నారు. నేతల మధ్య సమన్వయం, రిలేషన్స్ ను పెంపొందిస్తాయన్నారు. ఇక తెలంగాణలో అలయ్ బలయ్ కార్యక్రమం ఆనవాయితీగా వస్తోందని, ఇది మంచి సాంప్రదాయమన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడం సంతోషకరమన్నారు. దసర తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్ సాంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. దత్తన్న నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చరిత్రలో నిలిచిపోవాలని కోరుకున్నారు. భవిష్యత్ లోనూ అలయ్ బలయ్ దిగ్విజయంగా కొనసాగాలని కోరుకున్నారు.


Similar News