తీన్మార్ మల్లన్నకు గుడ్ న్యూస్.. మద్దతు ప్రకటించిన మరో సంఘం
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులు బహిరంగంగా మద్దతు పలికారు.
దిశ, తెలంగాణ బ్యూరో: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులు బహిరంగంగా మద్దతు పలికారు. పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోనే స్పష్టత ఇవ్వడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయ కుటుంబాల్లోని పట్టభద్రులు ‘సీపీఎస్ రద్దు - పాత పెన్షన్ పునరుద్ధరణ’ స్లోగన్‌తో తీన్మాల్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని స్పష్టం చేశారు.
ఒక జర్నలిస్టుగా ఉన్న సమయంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌కు తీన్మార్ మల్లన్న మద్దతు పలికారని, ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఈ డిమాండ్‌కు ఆచరణ రూపం ఇవ్వడానికి కృషి చేస్తారన్న నమ్మకంతో మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, రాష్ట్ర బాధ్యులు సమావేశమై ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.