TG Govt: ఇందిరమ్మ ఇళ్లపై BIG అప్డేట్

ఇందిర‌మ్మ ఇండ్ల(Indiramma indlu) గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, బేస్‌మెంట్ పూర్త‌యిన ఇండ్ల‌కు త‌క్ష‌ణం చెల్లింపులు జ‌ర‌పాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy) క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

Update: 2025-03-28 11:57 GMT
TG Govt: ఇందిరమ్మ ఇళ్లపై BIG అప్డేట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఇందిర‌మ్మ ఇండ్ల(Indiramma indlu) గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, బేస్‌మెంట్ పూర్త‌యిన ఇండ్ల‌కు త‌క్ష‌ణం చెల్లింపులు జ‌ర‌పాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy) క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో వ‌రంగ‌ల్ స్మార్ట్ సిటీ ప‌నులు, వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌, తాగునీరు, ఇందిర‌మ్మ ఇండ్లు త‌దిత‌ర అంశాల‌పై, అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క(Seethakka), సీఎం స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డితో క‌లిసి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా శాస‌న‌స‌భ్యులు, క‌లెక్ట‌ర్లు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశ‌మ‌ని దీనిని దృష్టిలో పెట్టుకొని క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం నాలుగు విడ‌త‌ల‌లో చెల్లింపులు చేస్తుంద‌ని, మొద‌టి విడ‌త‌లో బేస్ మెంట్ లెవెల్ పూర్త‌యిన ఇండ్ల‌కు ల‌క్ష రూపాయిలు ఇస్తుంద‌ని, బేస్ మెంట్ పూర్త‌యిన ఇండ్ల వివ‌రాల‌ను హౌసింగ్ విభాగానికి పంపిస్తే త‌క్ష‌ణ‌మే చెల్లింపులు చేస్తామ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హ‌త క‌లిగిన ల‌బ్ధిదారుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు కేటాయించ‌ని 2 బీహెచ్‌కే ఇండ్ల‌ను కేటాయించాల‌ని అలాగే మొండి గోడ‌ల‌తో ఉన్న ఇండ్ల‌ను పూర్తిచేయ‌డానికి కాంట్రాక్ట‌ర్ ముందుకు రాని ప‌క్షంలో ల‌బ్ధిదారులే ఆ ఇండ్ల‌ను పూర్తిచేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంద‌ని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసి ఇండ్ల‌ను కేటాయించాల‌ని సూచించారు. వేస‌వి కాలంలో ఏ గ్రామంలో ప‌ట్ట‌ణంలోగానీ తాగునీటి స‌మ‌స్య రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. ప్ర‌ధానంగా జిల్లా క‌లెక్ట‌ర్లు ఈ అంశానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జిల్లా అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని అధికారులు వారంలో మూడు రోజులు గ్రామాల్లో ప‌ర్య‌టించాల‌ని సూచించారు.

వ‌చ్చే మూడు నెల‌లు చాలా కీల‌క‌మ‌ని ప్ర‌జ‌ల‌కు ఎక్కడా తాగునీటి గురించి ఇబ్బంది క‌ల‌గ‌కుండా నీళ్లు రావ‌డం లేద‌న్న విమ‌ర్శ రాకుండా ప‌నిచేయాల‌న్నారు. నీటి కొర‌త ఉన్న ప్రాంతాల‌లో ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయ‌డం, చెడిపోయిన బోర్లు, హ్యాండ్ పంప్ ల‌ను త‌క్ష‌ణం మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలని సూచించారు. వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను రెండు నెల‌ల్లో పూర్తిచేసి ఆ త‌ర్వాత మ‌రో నెల‌రోజుల్లో వైద్య సేవ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌రికరాల‌ను అమ‌ర్చి జూన్ చివ‌రినాటికి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ ఆసుప‌త్రి అందుబాటులోకి వ‌స్తే ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అత్యాధునిక వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. మ‌డికొండ డంపింగ్ యార్డు స‌మ‌స్య‌కు వారం రోజుల్లో తాత్కాలిక ప‌రిష్కారం చూపించి ఆ తర్వాత శాశ్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. దీనికి సంబంధించి సీడీఎంఏ డైరెక్ట‌ర్ శ్రీ‌దేవిని స్వ‌యంగా అక్క‌డ ప‌ర్య‌టించి ప‌రిష్కార మార్గాల‌ను సూచించాల‌ని ఆదేశించారు.

వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ ర‌హ‌దారి ప్రాంతంలో శాశ్వ‌త డంపింగ్ యార్డు కోసం 150 నుంచి 200 ఎక‌రాల భూమిని సేక‌రించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి చెరువు పూడిక‌తీత ప‌నుల‌ను ఎట్టి ప‌రిస్దితుల‌లోను వ‌ర్షాకాలం ప్రారంభ‌మ‌య్యేలోపు పూర్తి చేయాల‌న్నారు. వ‌రంగ‌ల్ స్మార్ట్ సిటీ ప‌నుల విష‌యంలో అధికారులు ప్ర‌ణాళికా బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో శాస‌న‌స‌భ్యులు క‌డియం శ్రీహ‌రి, నాయ‌ని రాజేందర్‌, య‌శ‌స్విని రెడ్డి, దొంతి మాధ‌వ‌రెడ్డి, నాగ‌రాజు, ముర‌ళీనాయ‌క్‌, రామ‌చంద్ర నాయ‌క్‌, రేవూరి ప్ర‌కాష్‌రెడ్డి, గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్సీ బ‌స‌వ‌రాజు సార‌య్య‌, వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణి, మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్‌, ఆర్ అండ్ బి సెక్రెట‌రీ హ‌రిచంద‌న, కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ క‌ర్ణ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News