రాహుల్ గాంధీని బీజేపీ వేధిస్తోంది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగ మేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగ మేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయేతర కక్ష దాగినట్లు స్పష్టమవుతోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాహుల్ గాంధీపై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్ సభ స్పీకర్ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆ వెంటనే ఎంపీగా దక్కిన నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం చేయడం అంత వ్యక్తిగత కక్ష లాగా అనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో మోడీ అదానీల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకి చూపించి రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి అధికారిక నివాసం నివాసం నుంచి ఖాళీ చేయించారని విమర్శించారు.
రాహుల్ గాంధీ కుటుంబం దేశ సమగ్రత కోసం.. సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసిందని నారాయణ గుర్తు చేశారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్పై వ్యక్తిగత కక్షతో సాంకేతిక అంశాలను చూపించి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయన తన ఢిల్లీ అధికారిక నివాస తాళం ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. ఈ పాపం ఊరికే పోదని దేశ ప్రజలు మరిచిపోరని, అలాగే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను సైతం గమనిస్తున్నారని బీజేపీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు.