కాంగ్రెస్‌ను పక్కన పెట్టి పోరాటం చేయలేం: సీపీఐ నారాయణ
డాలర్ రూపాయి విలువ దారుణంగా పడిపోతున్నప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రూపాయి విలువ పడిపోలేదని, డాలర్ బలంగా ఉన్నదని అబద్దాలు చెబుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
దిశ, తెలంగాణ బ్యూరో: డాలర్ రూపాయి విలువ దారుణంగా పడిపోతున్నప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రూపాయి విలువ పడిపోలేదని, డాలర్ బలంగా ఉన్నదని అబద్దాలు చెబుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మండిపడ్డారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అబద్ధాల కోరు ప్రభుత్వమని ద్వజమెత్తారు. దాని ప్రతిబింబంగానే దురదృష్టవశాత్తు మహిళగా ఉండి మరీ నిర్మలా సీతారామన్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. గతంలో మోడీ ప్రభుత్వం ఫాసిస్టు పోకడలకు పోతున్నదని భావించామని, ఇప్పుడు ఏకంగా అప్రకటిత ఫాసిజం అమలు చేస్తోందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం ఇంత క్రూరంగా లేదన్నారు. విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు ఘనంగా జరిగాయని, ఏపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా, బహిరంగ సభకు 70 వేల మంది పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను పక్కన పెట్టి బీజేపీ వ్యతిరేక పోరాటం చేయలేమని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ సాయిబాబాకు ముంబై హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, సుప్రీం కోర్డు నిరాకరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారని, కాని ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్ అసలైన తీవ్రవాదులని ఆరోపించారు. వారు గోరక్షణ పేరుతో దాడులు చేస్తారని, మహిళలను అత్యాచారం చేసిన వారికి సన్మానాలు చేస్తారని అన్నారు. విజయవాడలో జరిగిన జాతీయ మహాసభలో చేసిన రాజకీయ తీర్మానానికి అనుగుణంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు, శక్తులను కూడగట్టి పోరాటాలకు సిద్ధమవుతామని నూతనంగా జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సయ్యద్ అజీజ్ పాషా వెల్లడించారు. విభజన హామీలపై కలిసొచ్చే పార్టీలతో ఉద్యమాలు చేస్తామని కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఎన్.బాల మల్లేష్, ఈటీ. నర్సింహా పాల్గొన్నారు.