అసెంబ్లీ ఎన్నికల్లో KCR ఓటమికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నారాయణ..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభివర్ణించారు.

Update: 2024-06-02 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభివర్ణించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆదివారం గన్ పార్క్ వద్ద అమరుల స్థూపం వద్ద నివాళులు ఆర్పించారు. అనంతరం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కూర్చున్న కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. ఆ ఆరు నెలలు ఫామ్ హౌస్‌లో పడుకుని కేబినెట్ ఏర్పాటు చేయలేదన్నారు. అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశారని విమర్శించారు. అందుకే ఈసారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారని తెలిపారు.

రేవంత్ రెడ్డి ఉత్సాహవంతులని, కేంద్ర పార్టీ సపోర్ట్ కూడా ఆయనకు ఉందన్నారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ పని చేయాలని, అనవసరమైన గిల్లి కజ్జాలు పెట్టుకుంటే టైం వేస్ట్ తప్ప.. ఉపయోగం ఉండదని రేవంత్ గమనించాలని సూచించారు. అభివృద్ధిలో ఒక్కడివే కాకుండా అందరినీ కలుపుకుని పోవాలని, అందరినీ కలుపుకుని పోతేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అందుకు కమ్యూనిస్టు పార్టీ కూడా సహకరిస్తుందని నారాయణ తెలిపారు.

‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని, ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ఏ ఒక్కరో ఇద్దరో కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉందన్నారు. తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లు కేసీఆర్ పాలించారని.. సరైన పద్ధతిలో ఆయన పరిపాలన అందించలేకపోయారని అన్నారు. నీరు, నిధులు, నియామకాలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

తెలంగాణను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్.. తన కుటుంబ సభ్యులను మాత్రం బాగానే అభివృద్ధి చేసుకున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ కేబినెట్‌లో మొత్తం 17మందిలో 12 మందిని తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నా నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారని.. అందువల్లే కేసీఆర్ ఓటమి పాలయ్యారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షతో పరిపాలన కొనసాగించలేకపోయారని విమర్శించారు.


Similar News