CV Anand: ఎంత చెప్పినా వినలే.. వారి వల్లే ఆలస్యం: సీవీ ఆనంద్
నిమజ్జనాలపై సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని ఇందుకోసం 25 వేల మంది సిబ్బంది షిఫ్టుల ప్రకారం 40 గంటల పాటు నిర్విరామంగా విధులు నిర్వహించారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసుతో పాటు బల్దియా, ట్రాన్స్ కో మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమం కోసం కష్టపడ్డారని వీరందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ప్రాంతాల్లో కొంత మంది అర్థరాత్రి తర్వాత కూడా శోభాయాత్రను తీశారని ముఖ్యంగా బేగంబజార్ చత్రి, అబీబ్ నగర్ వంటి ప్రాంతాల్లో నిమజ్జనాలు త్వరగా పూర్తి అయ్యేలా తాము ఎంత చెప్పినా కొంతమంది మండప నిర్వాహకులు ముందుకు రాలేదన్నారు. అలాంటి వారితో మళ్లీ మాట్లాడుతామన్నారు. నిన్న ప్రభుత్వం నిమజ్జనం కోసం ప్రత్యేకంగా సెలవు ప్రకటించిందని నిన్ననే నిమజ్జనం పూర్తి చేసుకుంటే ఈరోజు ఉద్యోగాలకు వెళ్లే సాధారణ ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదన్నారు. అలాంటి వారు వచ్చే ఏడాదైనా పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిన్న హుస్సేన్ సాగర్ లో రికార్డు ప్రకారం 5,500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, రికార్డులో లేకుండా అనధికారికంగా ఇతర కమిషనరేట్ల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా కొన్ని విగ్రహాలు వచ్చాయన్నారు. వీటి వల్ల కూడా కొంత ఆలస్యం జరిగిందన్నారు. కొన్ని విగ్రహలు అంచనాలకు మించి ఎత్తులో రావడం, కొన్ని చోట్ల కండీషన్లలో లేని వాహనాలు బ్రేక్ డౌన్ కావడం వల్ల ఊరేగింపుకు ఆలస్యం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరిగితే ఇవాళ ఉదయం 8 గంటల లోపూ నిమజ్జన కార్యక్రమం పూర్తిగా ముగించే అకాశం ఉండేదన్నారు. ప్రస్తుతం కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లలో ఉన్నాయని వెల్లడించారు. రాత్రి 9 గంటల వరకు రోడ్లన్నీ సాధారణ ట్రాఫిక్ వెళ్లేందుకు వీలుగా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు వివరించారు. గతేడాది కంటే మెరుగైన పరిస్థితి ఉందన్నారు. కొన్ని కోట్ల కేసులు నమోదు అయ్యాయని వాటిని దర్యాప్తు చేస్తామన్నారు.