మంత్రి శ్రీనివాసగౌడ్ ఎన్నికల కేసు.. పిటిషనర్‌కు కోర్టు నోటీసు
మంత్రి శ్రీనివాసగౌడ్ ఎన్నికల అర్హత కేసుపై ఈ నెల 28న ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరగనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి శ్రీనివాసగౌడ్ ఎన్నికల అర్హత కేసుపై ఈ నెల 28న ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరగనున్నది. గత విచారణ సందర్భంగా మంత్రితో పాటు అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా ఎన్నికల అధికారి తదితర మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ప్రతిని కోర్టుకు సమర్పించాల్సిందిగా జడ్జి జయకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆ ప్రతిని కోర్టుకు సమర్పించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ నెల 28న తిరిగి విచారణ జరపనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు విచారణకు హాజరుకావాల్సిందిగా పిటిషనర్ రాఘవేంద్రరాజుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న జరిగే విచారణకు హాజరుకాని పక్షంలో పోలీసులు సమర్పించిన ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నది.