ఫోన్ ట్యాపింగ్ పూర్తి బాధ్యత కేటీఆర్‌దే: MLC బల్మూరి వెంకట్
ఫీజు లేకుండానే డీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, టెట్ క్వాలిఫై అయినోళ్లందరికీ అవకాశం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఫీజు లేకుండానే డీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, టెట్ క్వాలిఫై అయినోళ్లందరికీ అవకాశం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తిగా నిర్లక్షానికి గురయ్యారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేశామన్నారు. నిరుద్యోగుల కోరిక మేరకు మరోసారి టెట్ నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. దీంతో రేపు తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.
ఇక ఈ నెల 8 నుండి 19 వరకు మేనిఫెస్టోని రోజుకు రెండు పార్లమెంట్ పరిధిలో ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో తీసుకువెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలు గెలుపే లక్ష్యంగా పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉన్నదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తుల స్వేచ్ఛని హరించిన చరిత్ర కేటీఆర్‌దే అని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి నీచ చరిత్ర అని పేర్కొన్నారు. ఇక చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ముందుకు వస్తున్నారని, తామేమీ బలవంతం పెట్టడం లేదన్నారు. మరోవైపు ఐపీఎల్ టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీన్ని సీఎంకు చేరవేస్తానన్నారు. సీరియస్‌గా తీసుకొని సమస్య పరిష్కారమయ్యేలా చొరవ చూపుతామన్నారు.