తెలంగాణలో కాకరేపుతోన్న కేసీఆర్ లేఖ.. భగ్గుమన్న కాంగ్రెస్
తెలంగాణలో పవర్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు వివరణ ఇస్తూ కేసీఆర్ రాసిన లేఖ రచ్చగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పవర్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు వివరణ ఇస్తూ కేసీఆర్ రాసిన లేఖ రచ్చగా మారింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ నర్సింహారెడ్డి తీరు సరిగా లేదని, అందువల్ల ఈ ఎంక్వైయిరీ కమిషన్ బాధ్యతల నుంచి నర్సింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని కమిషన్ కు ఇవాళ తాను రాసిన లేఖలో కేసీఆర్ కోరారు. దీంతో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేసీఆర్ విమర్శలకు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇలా బెదిరించే ధోరణి సరికాదని, ఎవరినో నిందితులుగా చేయడం కోసం విచారణ చేయడం లేన్నారు. తనను, తన ప్రభుత్వం పేరును బద్నాం చేసేందుకే సర్కార్ విచారణ జరుపుతోందని అనడంలో ఎలాంటి అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అన్ని చేసింది మీరే కదా అని ప్రశ్నించారు. అన్ని శాఖలలో మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా నడిచింది. అప్పుడు మంత్రులు చేసిందేముంది. ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇప్పంది పడుతున్నారు. విచారణ ముందుకు సాగకుండా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దప్ప ఎవరినో నిందితులుగా చేయడానికి కాదన్నారు.
గుట్టు వీడాల్సిందే: బీజేపీ
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గుట్టు తేలాల్సిందే అన్నారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ కొనుగోళ్లలో డబ్బులు చేతులు మారాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించిందని ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపించాలన్నారు. గతంలో ఆరోపణలు చేసిన రేవంత్, ఉత్తమ్, జానా రెడ్డిలను కూడా కమీషన్ విచారించాలని డిమాండ్ చేశారు. అవసరం అయితే కమిషన్ విచారణ ఇంకో వారం రోజుల పాటు పొడిగించాలన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2937.58 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. 6 నెలల్లో ఎక్కువ మొత్తం బిల్లుల చెల్లింపులకే ప్రాధాన్యత ఇచ్చిందని. వాటాల కోసమే కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితిపై ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.