వారి ఉసురు తగిలే కేసీఆర్ పతనం అయ్యారు: దయాకర్
బీఆర్ఎస్ పాలనలో బడుల పరిస్థితిపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పాలనలో బడుల పరిస్థితిపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్య పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ తెచ్చాను అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. విద్యను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను పాతరేసి కార్పొరేట్ మయం చేశారని అన్నారు. ఆ పేద పిల్లల ఉసురు తగిలే ఓటమి చెందారని చెప్పారు.
గడిచిన పదేళ్లలో 36 మంది హాస్టల్ విద్యార్థులు చనిపోయారని అన్నారు. సర్కార్ పాఠశాలలు మూసివేసి రాక్షస ఆనందం పొందారని మండిపడ్డారు. బడులు మూసేసి బార్లు తెరిచి తెలంగాణను తాగుబోతులకు అడ్డాగా మార్చారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాలన మొదలైందని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఏనాడూ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించలేదని అన్నారు. పేద విద్యార్థులకు విద్య దూరం కాకూడదు అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ బడులను ప్రొత్సాహించేలా ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు.