తెలంగాణలో వరదలొస్తే టాలీవుడ్ స్పందించదా?

వయనాడ్‌లోని వరదలకే చిత్ర పరిశ్రమ స్పందిస్తుందా? అంటూ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టింపు లేదా? అంటూ ప్రశ్నించారు.

Update: 2024-09-03 17:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వయనాడ్‌లోని వరదలకే చిత్ర పరిశ్రమ స్పందిస్తుందా? అంటూ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టింపు లేదా? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన వరదలు తెలంగాణ ప్రజానీకానికి పెద్ద సమస్యను తీసుకువచ్చిందని, ఇలాంటి కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. పక్క రాష్ట్రాల్లో విపత్తులు వచ్చినప్పుడు ముందుండి సాయం చేసిన చిత్ర పరిశ్రమ పెద్దలు, విద్యా, వ్యాపార వేత్తలు ఇప్పుడు ఎటు వెళ్లారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆపదలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తుచేశారు. ఇప్పటికే ఎన్టీఆర్, బాలకృష్ణతో పాటు మరి కొంత మంది నటులు వరద బాధితుల కోసం సాయం ప్రకటించారని, మిగతా బడా నటులు, నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. దీంతో పాటు హైదరాబాద్‌లో పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారని, వాళ్లు కూడా ప్రజలకు అండగా నిలవాలని రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపు రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి, ప్రజలకు సపోర్టు చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపు నిచ్చారు.


Similar News