Congress: గతంలో ఇలాగే స్పందించి ఉంటే బాగుండేది.. హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటీషన్ పై హైకోర్టు త్వరగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, గతంలో కూడా ఇలాగే స్పందించి ఉంటే బాగుండేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. హైకోర్టు తీర్పుపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ప్రశ్నిస్తూ.. స్పీకర్ కు సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వడం అనేది ఆహ్వానించదగినదని, స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజ్యంగ బద్దంగా, చట్టబద్దంగానే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
అలాగే హైకోర్టు త్వరగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంశంలో కూడా ఇదేవిధంగా స్పందిస్తే బాగుండేదని అన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందని తెలుసుకోవాలని అవసరం ఉందని, కేటీఆర్, హరీష్ రావు కు నాయకత్వ సమస్యలు రావడం కేసీఆర్ బయటకి రాకపోవడం వల్ల పార్టీ మీద నమ్మకం లేక పార్టీ మారే పరిస్థితి వచ్చిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తీసుకుంటున్నప్పుడు హైకోర్టు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇలాంటి అనైతిక సమస్యలు రావడం వెనుక కేసీఆర్ పాత్ర ఉంటుందని తెలుసుకోవాలన్నారు. ఇక స్పీకర్ కానీ, కాంగ్రెస్ పార్టీ గానీ రాజ్యంగ పరిధిని, హైకోర్టు పరిధిని దాటకుండానే నిర్ణయం తీసుకుంటారని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు.