‘ఫార్ములా ఈ-రేసు’ కేసులో గవర్నర్ తీరుపై కాంగ్రెస్ అసంతృప్తి

మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం గవర్నర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Update: 2024-11-17 02:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఫార్ములా ఈ-రేసు’ ఇష్యూపై విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తారా? నిర్ణయం చెప్పేందుకు ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు? అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేయడం వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం గవర్నర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన రాజ్‌‌భవన్‌కు చేరగానే ఈ-రేసు విచారణ ఫైల్‌పై సంతకం చేస్తారని ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ.. ఇప్పటివరకు రాజ్‌భవన్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. దీంతో కేటీఆర్‌ను అరెస్సు నుంచి తప్పించేందుకు బీజేపీ సహకరిస్తుందేమోనన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

మూడు వారాలుగా రాజ్‌భవన్‌లోనే ఫైల్

దసరా తరువాత ఫార్ములా ఈ-రేసుపై విచారణకు పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్‌కు ఫైల్ పంపింది. కానీ.. ఆ ఫైల్‌కు ఇంతవరకు గవర్నర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. జిష్ణుదేవ్ మాత్రం ఆ ఫైల్‌ను ఇంకా పరిశీలించలేదని తెలుస్తున్నది. ఢిల్లీకి వెళ్లే ముందు న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్‌కు గవర్నర్ ఆఫీసు నుంచి లేఖ వెళ్లిందని ప్రచారం జరిగింది. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతోనే గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. గవర్నర్ ఆఫీసు నుంచి ఇప్పటివరకు న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ ఆఫీసుకు ఎలాంటి ఫైల్ వెళ్లలేదని ప్రతివాదనలూ ఉన్నాయి. ఒకవేళ న్యాయ సలహా కోసం ఏజీని రాజ్‌భవన్‌ సంప్రదించి ఉంటే, వారు వెంటనే రెస్పాండ్ అవుతారని అటార్నీ జనరల్ ఆఫీసులో పనిచేసి రిటైర్డ్ అయిన లీగల్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.

కేటీఆర్‌కు సహకరిస్తున్నారనే డౌట్

ఫార్ములా ఈ-రేసుపై విచారణకు అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేయడం వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు కాంగ్రెస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య స్నేహం ఉండటం వల్లే విచారణకు అనుమతి రావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఇటీవల కేటీఆర్ ఢిల్లీ టూర్‌ను ప్రధాన కారణంగా చూపుతున్నారు. తనను అరెస్ట్ నుంచి తప్పించాలని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ లీడర్లను ప్రాధేయపడ్డారని.. ఆ సమయంలో గవర్నర్ సైతం అక్కడే ఉన్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సైతం ఫైల్‌పై గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా పెండింగులో పెట్టారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గవర్నర్‌కు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకుంటే.. వెంటనే విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేవారని అభిప్రాయపడుతున్నారు.

గవర్నర్ పర్మిషన్ ఎందుకు..?

17 ఏ/బీ నిబంధనల ప్రకారం ప్రభుత్వంలో జరిగిన నిర్ణయంపై విచారణ చేపట్టాలంటే ప్రభుత్వం అధిపతిగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ-రేస్ అనేది పురపాలకశాఖ, రేస్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం కావడంతో విచారణకు గవర్నర్ అనుమతించాల్సి ఉంది. గతంలో ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంతో అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఇక్కడ అలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందస్తుగా గవర్నర్ అనుమతి కోసం రెక్విస్ట్ పెట్టింది. ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతించాలని సీఎస్ గవర్నర్‌కు లేఖ పంపించారు.


Similar News