కాంగ్రెస్‌దే అధికారం.. కలిసొచ్చే అంశాలివే..! : పొంగులేటి ప్రసాద్‌రెడ్డి
‘పాలేరు నియోజకవర్గంలోని ఓ మండలంలో ప్రచారానికి వెళ్లినప్పుడు ఓ అవ్వ నా చేయి పట్టుకుని తన ఇంటికి లాక్కెళ్లింది.
‘పాలేరు నియోజకవర్గంలోని ఓ మండలంలో ప్రచారానికి వెళ్లినప్పుడు ఓ అవ్వ నా చేయి పట్టుకుని తన ఇంటికి లాక్కెళ్లింది. నిలువనీడ లేక కూలిపోయిన ఆ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. చూసి చాలా బాధేసింది. ప్రభుత్వం ఇల్లు ఇస్తామంటుంది.. నాలాంటి వాళ్లకు కాకుండా ఎవరికి ఇస్తుంది? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే చెప్పాల్సి ఉన్నా.. నేనే స్వయంగా నా ఖర్చుతో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాను.’
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి
దిశ, ఖమ్మం బ్యూరో: ఈసారి ఎన్నికల అనంతరం అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘దిశ’ ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు వెల్లడించారు. జిల్లాలోనే కాక రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బలమైన నాయకులని వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ఖాయమని తెలిపారు. కొద్దికాలం నుంచి పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం చేస్తున్నానని, సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నామని ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని, అయినా భరించామన్నారు. ఇక భయపడేందుకు ఏమీ లేదని, ఎంతకైనా తెగిస్తామని దొరల గడీలు బద్ధలు కొడుతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తమ ముందున్న కర్తవ్యం అన్నారు.
యువతలో కాంగ్రెస్‌పై విపరీత క్రేజ్..
10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకు యువత కూడా పార్టీపై చాలా క్రేజీగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని కలలు కంటున్నారని చెప్పారు. కేవలం ఒక సామాజిక వర్గం నుంచే ఈ అభిప్రాయాలు వ్యక్తం కావడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి అధికార బీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ వర్గాలన్నీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, సైలెంట్ ఓటింగ్ ప్రభావం ఈసారి కాంగ్రెస్‌కు బాగా కలిసివస్తుందని పేర్కొన్నారు.
ఇండ్లు, రేషన్ కార్డుల సమస్యలు..
పాలేరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు, రేషన్ కార్డుల సమస్య తన దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం కట్టిస్తున్న, కట్టించిన డబుల్ ఇండ్లు ఎవరికిచ్చారని, ఎన్ని కట్టారని ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు. రేషన్ కార్డులు కూడా లేని బీదలు ఇంకా అనేకమంది ఉన్నారని, ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు ముఖ్యం కావడంతో అనేకమంది లబ్ధిపొందక ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ధరణి గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉన్నదని, ఒకరి భూములు ఒకరిపేరిట బదలాయించడంతో బాధితులు ఆఫీసుల చుట్టూ తిరగలేక నానా అగచాట్లు పడుతున్నారని తెలిపారు.
ప్రజాక్షేత్రంలో తిరిగి.. సమస్యలు తెలుసుకుంటూ..
రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ, సమస్యలు తెలుసుకుంటూ ప్రజల భవిష్యత్‌కు భరోసా ఇస్తూ ముందుకుసాగుతున్నానని ప్రసాద్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానంగా గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా తొలి రోజుల్లోనే కృషి చేస్తామని చెప్పారు. డబ్బుల మూటలతో ఓట్లు కొనుగోలు చేద్దామనుకుంటున్న అధికార పార్టీ అభ్యర్థికి ఈసారి ప్రజలే చుక్కలు చూపిస్తారని, అధికార బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా ఉందని వెల్లడించారు. పాలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గెలుపు ఖాయమని, మెజార్జీ అత్యధికంగా రావడం కోసమే తమ ప్రయత్నం అన్నారు.
మారిన ఈక్వేషన్లతోనే పాలేరుకు పొంగులేటి..
సామాజిక సమీకరణలు, మారిన ఈక్వేషన్ల కారణంగానే పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేస్తున్నారని చెప్పారు. ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఒత్తిడి ఉన్నా.. అధిష్టానం ఆదేశాల మేరకు పాలేరు బరిలో ఉండాల్సి వస్తుందన్నారు. అయినా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు పొంగులేటి, తుమ్మల ఇద్దరూ ప్రచారం నిర్వహిస్తారని, 10కి 10 స్థానాలు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తారని వెల్లడించారు. పాలేరులో కాంగ్రెస్ ఓటు బ్యాంకుతోపాటు పొంగులేటి అభిమానులు అనేకం ఉన్నారని, వీరికి తోడు తుమ్మల అనుచరులు కూడా కలిసివచ్చే అంశంగా పేర్కొన్నారు. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ ఓట్లతోనేనని, ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీని వీడలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కొందరు అధికార పార్టీతో ఉన్నారని, వారు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
యాక్టివ్ రోల్ పోషిస్తా..
ముందుముందు రాజకీయాల్లో ఇంకా యాక్టివ్ రోల్ పోషిస్తానని ప్రసాద్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్ ప్రణాళిక దృష్ట్యా క్రియాశీలకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కొద్దిరోజుల ప్రచారంలోనే అనేక విషయాలు తెలుసుకున్నానని, ఎక్కడికి వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. తమ పార్టీలో అసంతృప్త నేతల ఎవరూ లేరని గోబెల్ ప్రచారం మాత్రమేనన్నారు. రాయల నాగేశ్వరరావు పార్టీకి చాలా లాయల్‌గా ఉన్నారని, పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గేదేలేదన్నారు. నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. వాళ్లకే ఎదురుదెబ్బ తగులుతుందని స్పష్టం చేశారు.
Read More..
రాహుల్ ఎంట్రీతో రాష్ట్రంలో మారిన సీన్.. నేతల మదిలో ‘YSR యాత్ర’ స్మృతులు!