భూపరిపాలనను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు.. రికార్డులు సరి చేయడంపై స్పెషల్ ఫోకస్

ఐదేండ్ల అస్తవ్యస్త భూపరిపాలనను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. రికార్డులు సరి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది.

Update: 2024-10-10 02:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మునుపటి అస్తవ్యస్త భూపరిపాలనను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. రికార్డులు సరి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యంతో అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటున్నాయని సర్కారు ఇప్పటికే గుర్తించి ఆ మేరకు చర్యలు షురూ చేసింది. దీనికి సంబంధించిన అధికారాలన్నీ మండల స్థాయి ఆఫీసర్లకే కట్టబెట్టింది. కొత్త చట్టం వస్తున్నదంటూ కొందరు అధికారులు వర్క్ విషయంలో కాలయాపన చేస్తున్నారు. అలాంటి వారిని చెక్ పెట్టేందుకు త్వరలోనే కొత్త ఆర్ఓఆర్ - 2024ను అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే చట్టాన్ని ఫైనల్ చేసి సిద్ధంగా ఉంచిన సర్కారు.. కేబినెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా ప్రవేశ పెట్టి ఆమోదించేందుకు సిద్ధం చేసింది. వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం అమల్లోకి రానున్నది.

దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా..

ధరణి పోర్టల్, ఆర్‌ఓఆర్ 2020 అమలు ద్వారా లక్షలాది మంది కష్టాలు పడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా కొత్త ఆర్ఓఆర్ యాక్టును రూపొందించినట్టు ప్రకటించారు. చట్టం రూపొందించే ముందు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి అమలు చేస్తున్నది. వేలాది మంది మేథావులు, రెవెన్యూ నిపుణులు, రిటైర్డ్, ప్రస్తుత అధికారులు, న్యాయవాదుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. భావితరాలకు ఉపయోగపడేలా, కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు అనువుగా ఈ చట్టంలో మార్పులు చేశారు. ఈ క్రమంలో ప్రతి భూ కమతానికి యూనిక్ నంబర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆధార్ నంబర్ ద్వారా వ్యక్తి వివరాలు ఎలా బయటపడతాయో, భూదార్ నంబర్ ద్వారా సదరు భూమి డిటెయిల్స్ మొత్తం అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకున్నది.

బంగాళాఖాతంలో కలిపేస్తామంటేనే..

కేసీఆర్ హయాంలో ఆర్ఓఆర్ యాక్ట్ రూపకల్పనలో భాగస్వాములైన కొందరు సవరణలతో సరిపెడదామంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. కొత్త చట్టం అవసరం లేదని వాదించిన వారిలో ఓ రిటైర్డ్ ఐఏఎస్ ప్రధానంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి పడుతున్న సమయం, దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్న రీజన్స్‌తో జనం విసిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ధరణి, ఈ చట్టం ద్వారా ఎంత అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తించింది. పాదయాత్రలు, సభలు, సమావేశాల్లో భూ సమస్యలే ప్రధాన ఎజెండాగా నిలిచాయి. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామంటేనే జనం నుంచి అనూహ్య స్పందన లభించింది.

కొన్ని పొలిటికల్ డిసెషన్ మీద ఆధారం

ప్రజాభిప్రాయ సేకరణలో రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునల్‌పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. నిజానికి ఇది కేవలం రికార్డు ఆఫ్ రైట్స్ చట్టం మాత్రమే. అంటే రికార్డులను సవరించడానికి మాత్రమే. హక్కుల కల్పనకు కాదు. ఐతే కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను సైతం రద్దు చేయడంతో ప్రతి చిన్న అంశానికీ బాధితులు, అన్యాయం జరిగిందని భావించిన వారు సివిల్ కోర్టులను ఆశ్రయించడం తప్పనిసరైంది. ఇప్పుడు దానికి పరిష్కారంగానే రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించనున్నారు. రికార్డుల సవరణకు మాత్రమే పరిమితమైన అంశానికి ట్రిబ్యునల్ అవసరం లేదనేది నిపుణుల అభిప్రాయం. మిగిలిన అన్ని చట్టాలు, వాటి ఆధారంగా తలెత్తే సమస్యల పరిష్కారంపై ట్రిబ్యునల్ ఉండాలా? వద్దా? ఉంటే రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేయాలా? రిటైర్డ్ జడ్జిలతో చేయాలా? అన్న దానిపై చర్చ జరగాలి. ఇప్పటికైతే రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణతో న్యాయం దక్కుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అలాగే అప్పీల్ వ్యవస్థ ఆర్డీవోతోనే స్టార్ట్ కావాలన్న అభిప్రాయాలూ వచ్చాయి. ఐతే కొన్ని రకాల మ్యుటేషన్, ఇతర అంశాల్లో ఆర్డీవోలకు అధికారాలు కట్టబెట్టారు. అలాంటి సందర్భంలో వారు చేసిన పనులపైన వారికే అప్పీల్ చేసుకునే విధానం సరికాదంటున్నారు. భూముల విలువలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆర్డీవో నుంచే అప్పీల్ వ్యవస్థను పునరుద్ధరించడం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అందుకే అదనపు కలెక్టర్/కలెక్టర్‌కు అప్పీల్, సీసీఎల్ఏకు రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకునేలా ఉండడమే మేలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ రెండు అంశాలపై అధికారుల నిర్ణయం మాత్రమే డ్రాఫ్ట్ పాలసీ ప్రకారమే ఉన్నట్లు కనిపించింది. కానీ పొలిటికల్ డిసిషన్‌లో ఏమైనా మార్పులు ఉంటే చెప్పలేమంటున్నారు.

డ్రాఫ్ట్ యథాతథమే

మ్యుటేషన్ ఆపే అధికారం తహశీల్దార్లకు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఐతే హక్కులు లేకపోయినా సేల్ డీడ్ చేసినప్పుడు, భూమి లేకుండానే అమ్మినప్పుడు.. అవి తహశీల్దార్ దృష్టికి వచ్చినా, ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆపే అధికారం ఉండడమే మంచిదని తేల్చారు. అది నిర్దిష్ట కాలానికే పరిమితం చేయడం ద్వారా నష్టమేమీ లేదంటున్నారు. తప్పు చేసిన అధికారికి శిక్ష పడేటట్లు చట్టంలో సెక్షన్ ఉండాలని పలువురు అడ్వొకేట్లు సూచించారు. ధరణి బాధితుల నుంచి సైతం ఈ డిమాండ్ ఉన్నది. ఇంత అన్యాయంగా, అక్రమంగా తమను ఇబ్బందులకు గురి చేశారన్న ఆవేదన కనిపించింది. వాళ్లు తప్పు చేసి తమను ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనితో అప్పీల్ వ్యవస్థతో చెక్ పడుతుందంటున్నారు. ఏ అధికారి అయినా తప్పు చేస్తే ఐపీసీ ద్వారా శిక్షించే వీలుందని గుర్తు చేస్తున్నారు. ఇక సాదాబైనామా రెగ్యులరైజేషన్ పై అనుమానాలు వ్యక్తమైనా.. అవన్నీ గైడ్ లైన్స్ ద్వారానే క్లారిటీ రానున్నది.

మ్యాప్ ఉండాల్సిందే

కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వ్యాపారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయంటూ గగ్గోలు పెడుతున్నారు. నిజానికి రికార్డుల్లో భూమి, గ్రౌండ్‌లో భూమి సరిగ్గా ఉన్నప్పుడు మ్యాప్ గీసి పెట్టడానికి ఉండే ఇబ్బందులు ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రికార్డుల్లో భూమి ఉండి, వారికి ల్యాండ్ ఎక్కడున్నదో తెలియని వారికి మాత్రమే సమస్య ఎదురవుతుంది. దానికి ప్రభుత్వం బాధ్యత ఎలా అవుతుందన్న అభిప్రాయం నెలకొన్నది. కర్ణాటకలో కొంత కాలంగా మ్యాప్ తప్పనిసరి చేయడం ద్వారా డిస్ప్యూట్ ఫ్రీగా మారిందని అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలో 1500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఉన్నారని, వారందరికీ ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విధానం అమలుతో తెలంగాణలోనూ రికార్డులకు, క్షేత్ర స్థాయికి మధ్య వ్యత్యాసం తగ్గే అవకాశం కలుగుతుంది. మ్యుటేషన్, దరఖాస్తు ఫీజు తగ్గించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు రూ.1,000, మ్యుటేషన్ చేసుకుంటే ఎకరాకు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.

రోల్ మోడల్‌గా చట్టం - పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, రాష్ట్ర మంత్రి

ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొచ్చి దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా కొత్త ఆర్ఓఆర్ - 2024ను తీసుకొస్తున్నాం. ప్రస్తుతం ఉన్న చట్టంలో తప్పొప్పులు సవరించి, అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. గతంలో తెచ్చిన ఆర్ఓఆర్ 2020 చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కొత్త చట్టం డ్రాఫ్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి అభిప్రాయాలు తీసుకున్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీల సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చట్టం తీసుకురావాలని నిర్ణయించాం. కొద్ది రోజుల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాం.


Similar News