గెలుపు తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ధీమా..!

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలింగ్ ముగియడంతో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరిలోనూ ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి గెలుపొందుతారోనని ఆసక్తి నెలకొంది.

Update: 2023-12-02 03:09 GMT

దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలింగ్ ముగియడంతో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరిలోనూ ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి గెలుపొందుతారోనని ఆసక్తి నెలకొంది. ఇబ్రహీంపట్నంలో మొత్తం 3 లక్షల 10 వేల ఓటర్లు ఉండగా.. 316 పోలింగ్ బూత్‌ ఉన్నాయి. ఇక్కడి నుంచి మూడు పర్యాయాలుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, బీజేపీ నుంచి నోముల దయానంద్ గౌడ్ పోటీ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మంచిరెడ్డి వర్సెస్ మల్‌రెడ్డిలలో ఎవరు గెలుస్తారని ఇబ్రహీంపట్నం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈసారి కూడా గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి కృష్ణా జలాలను ఇబ్రహీంపట్నం చెరువుకు తీసుకురావడానికి, నిత్యం కరువుతో సతమతమవుతున్న నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలతో తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీలో మంచిరెడ్డి చేరారు. ఎన్నికల్లో గెలుపు తమ పార్టీదేనని, తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే గెలిపించి ప్రజలు ఆశీర్వదించారని, ఈ ఎన్నికల్లో కూడా తనకే ఓట్లు వేసి నాలుగోసారి ప్రజలు తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తారని మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బలాలు ఇవే..

👉 సుదీర్ఘమైన రాజకీయ అనుభవం.

👉 అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థిగా చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు పొందుపరిచే అవకాశం.

👉 రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీలోమంచి గుర్తింపు.

👉 జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి సఫలం.

👉 అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.

👉 ప్రచారంలో కూడా ఎమ్మెల్యే మంచిరెడ్డి ముందువరుసలో ఉన్నారు.

👉 బంటి యూత్ ఫోర్స్, ఎంకేఆర్ ఫౌండేషన్ల ద్వారా చేసిన కార్యక్రమాలు.

బలహీనతలు..

👉 మూడు పర్యాయాలుగా పనిచేస్తుండడంతో మార్పు కోరుకుంటున్న స్థానిక ప్రజలు.

👉 గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి కాకపోవడం.

కాంగ్రెస్ పార్టీ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి..

ఇబ్రహీంపట్నం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడినా నిరాశ చెందకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్రహీంపట్నం గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నాడు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే‌గా అతిపెద్ద నియోజకవర్గమైన మలక్‌పేట్ నుంచి రెండుసార్లు గెలిచారు. రెండు పర్యాయాలు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి మల్ రెడ్డి రంగారెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మల్‌రెడ్డి రంగారెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

బలాలు ఇవే..

👉 సుదీర్ఘమైన రాజకీయ అనుభవం.

👉 గతంలో అతిపెద్ద నియోజకవర్గమైన మలక్‌పేట్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం.

👉 మల్‌రెడ్డి రంగారెడ్డి దగ్గర పనిచేసిన కార్యకర్తలు మంచి నాయకులుగా అభివృద్ధి చెందారు.

👉 ఎమ్మెల్యే మంచిరెడ్డికి గట్టి పోటీ ఇవ్వడానికి సరిపోయే వ్యక్తి మల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రమే.

బలహీనతలు..

👉 ఎలక్షన్ల ముందే ప్రజల్లోకి వెళ్తారని ఒక విమర్శ ఉంది.

👉 బూత్ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడంలో విఫలం.

బీజేపీ నుంచి నోముల దయానంద్ గౌడ్..

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి టికెట్ సాధించిన నోముల దయానంద గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు. ఈయన సైతం గెలుపుపై ధీమాగా ఉన్నారు.

బలాలు..

👉 బీసీ నాయకుడిగా బీసీ సామాజికవర్గం ఓటర్లు మద్దతు.

👉 రాజకీయంగా ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు లేకపోవడం.

👉 బీజేపీ అండదండలు.

బలహీనతలు..

👉 బీసీ ఓటర్లను ఆకర్షించడంలో, బీజేపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయ పరిచి ప్రచారం చేయడంలో విఫలం.

👉 ఎన్నికల ప్రచారంలో సరైన ప్రణాళిక లేకపోవడం. ఓటర్లందరినీ కలవలేకపోవడం.


Similar News