అధిష్టానం ముందు వాదులాట.. Revanth Reddy పై హైకమాండ్‌కు ఫిర్యాదు

దిశ, తెలంగాణ బ్యూరో: హస్తినలోనూ కాంగ్రెస్​ నేతలు అధిష్టానం ముందు వాదులాటకు దిగారు

Update: 2022-08-22 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హస్తినలోనూ కాంగ్రెస్​ నేతలు అధిష్టానం ముందు వాదులాటకు దిగారు. సీనియర్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని పార్టీ నేతలు ఆరోపిస్తే.. తాను పిలిచినా రావడం లేదని, తనపై విమర్శలు చేస్తూ పార్టీ వ్యతిరేక తరహాలో చూస్తున్నారని రేవంత్​ రెడ్డి సమాధానమిచ్చారు. దీంతో వాగ్వాదం ముదురుతుండటంతో.. నేతలందరితోనూ కాకుండా.. ఒక్కొక్కరితో ఏఐసీసీ నేతలు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అనే అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. ఇదే సందర్భంలో తాను ఇక నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు ప్రియాంక గాంధీ.. రాష్ట్ర నేతలకు సూచించారు.

ఠాగూర్​, రేవంత్​ పైన ఫిర్యాదు

సాయంత్ర 5 గంటలకు ప్రియాంకతో భేటీ అయిన నేతలు రాష్ట్రంలో పరిస్థితులను ఏకరు పెట్టారు. పార్టీ దిగజారుతుందని, ఏఐసీసీ రాస్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ ఠాగూర్​, టీపీసీసీ చీఫ్​ రేవంత్​ తీరుతో నేతలు పార్టీ నుంచి వీడిపోతున్నారని ఆరోపించారు. ఏఐసీసీ నేతలు సముదాయిస్తున్నా.. నేతలు వినకపోవడంతో.. అందరితో సమావేశం కాకుండా.. విడివిడిగా భేటీ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రియాంక, కేసీ వేణుగోపాల్​ కలిసి ఒక్కో లీడర్​ తో మాట్లాడారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకున్నారు. మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్, బీజేపీ సభల గురించి రాష్ట్ర నేతలు ప్రియాంక గాంధీకి వివరించారు. ఈ క్రమంలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జ్​ ​ మాణిక్కం ఠాగూర్ తమను పట్టించుకోవడం లేదని సీనియర్లు ప్రియాంకకు కంప్లైంట్ చేశారు. హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి డిపాజిట్​ కూడా రాకపోవడంపై మరోసారి వివరించారు. అలాంటి తప్పిదం మునుగోడులో జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

త్వరలోనే మునుగోడుకు ప్రియాంక

కాగా, మునుగోడులో కాంగ్రెస్​ పార్టీ కూడా భారీ బహిరంగ సభకు ప్లాన్​ చేసింది. మునుగోడులో త్వరలోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర నేతలు అనుమతి కోరారు. దీనికి ప్రియాంక గాంధీ ఒప్పుకున్నారు. ఇంకా తేదీలను ఖరారు చేయలేదు.

ఎంపీ కోమటిరెడ్డి డుమ్మా

మునుగోడుతో పాటుగా రాష్ట్ర పరిస్థితులపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి డుమ్మా కొట్టారు. అంతకు ముందు ఉదయం పార్లమెంటరీ బోర్డు మీటింగ్​ కు హాజరయ్యారు. ఆ తర్వాత సాయంత్రం ఏఐసీసీ నేతలతో భేటీ కావాల్సి ఉండగా.. ఆయన ఉన్నఫళంగా హైదరాబాద్​ వచ్చారు.

అంతర్గత అంశాలను చర్చించాం : రేవంత్​ రెడ్డి

ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, మునుగోడు ఎన్నికలపై చర్చించామని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలపై కూడా చర్చించామని, మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపైనా ఏఐసీసీ నేతలకు వివరించామన్నారు. కాంగ్రెస్ లో అందరూ క్రమశిక్షణతో మెలగాలని అధిష్టానం సూచించిందని, త్వరలోనే మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తామని, జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పార్టీ పదవులపై ప్రియాంక గాంధీతో చర్చించామని, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డికి సమయం లేకపోవడం వల్ల మీటింగ్ కి రాలేదన్నారు. వెంకట్​ రెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశంలో అధిష్టానం సూచించిందని, ఆయన అభిప్రాయాన్ని తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తామని, అందరం కలిసికట్టుగా మునుగోడులో పని చేస్తామని రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

ప్రియాంక గాంధీ స్పెషల్​ ఫోకస్​ : మధుయాస్కీ

తెలంగాణ కాంగ్రెస్​ వ్యవహారాలను ఇక నుంచి ప్రియాంక గాంధీ నిశితంగా పర్యవేక్షిస్తానని చెప్పారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ గౌడ్​ తెలిపారు. రాష్ట్ర నేతలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారని, మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని, నేతల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప విభేదాలు లేవన్నారు. ఏఐసీసీ నేతలతో సమావేశానికి రాని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డితో పార్టీ సీనియర్​ నేత దామోదర రాజనర్సింహా వెళ్లి మాట్లాడుతారని మధుయాష్కీ వెల్లడించారు.

మునుగోడులో గెలువరు: ఎంపీ వెంకట్​ రెడ్డి

సోమవారం రాత్రి హైదరాబాద్​ కు చేరుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి విమానాశ్రయంలోనే మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వర్గం తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తోందని, తనతోపాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలను అగౌరవపరచడం ఆ వర్గానికి అలవాటుగా మారిందన్నారు. అనుభవం లేని వారికి బాధ్యతలు ఇవ్వడం వల్లే పార్టీ వీక్ అయిందని, రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేనంటూ తేల్చిచెప్పారు. 30ఏళ్ల నుంచి పార్టీకి నిజాయితీగా సేవలందిస్తున్న నేతలను హోంగార్డులుగా పోల్చుతున్నారని, ఆత్మగౌరవం కాపాడుకోవడానికే మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని వెంకట్​ రెడ్డి ప్రకటించారు. మాణిక్యం ఠాగూర్ వైఖరి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోతుందని ఆరోపించారు. తక్షణమే మాణిక్యం ఠాగూర్ ను తప్పించి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా కమల్నాథ్ వంటి నేతలను నియమించాలని, 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన తనకు మాణిక్కం ఠాగూర్ వల్ల అన్యాయం జరిగిందని, పది పార్టీలు ఫిరాయించిన నేతలను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ కు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగైదు వేల ఓట్లు మాత్రమే వస్తాయని, హుజురాబాద్​ లో వచ్చిన ఫలితమే ఇక్కడా వస్తుందన్నారు. పార్టీలో పని చేసే వారిని గుర్తించడం లేదని, అందుకే తాను ఏఐసీసీ మీటింగ్​ కు వెళ్లలేదని వెల్లడించారు. హుజురాబాద్​ లో లీడర్లు గట్టిగా పని చేసి మూడువేల ఓట్లు తెచ్చుకున్నారో అదే విధంగా మునుగోడులో కూడా అంతే తెచ్చుకుంటారని సెటైర్​ వేశారు. మాణిక్కం ఠాగూర్​ దొంగనాటకాలాడుతున్నారని, సీనియర్లను పట్టించుకోవడం లేదని, అందుకు తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ నాశనం అయిందని విమర్శించారు. మంత్రిగా, ఎంపీగా సీనియర్​ నేతగా ఉన్నా ఒక విధమైన ప్లాన్​ తో తనను తొక్కిపెడుతున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లనని ఎంపీ వెంకట్​ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు వెంకట్​ రెడ్డి లేఖ రాశారు. చండూరు మీటింగ్​, చెరుకు సుధాకర్​ చేరికపై తనకు కనీసం సమాచారం లేదని లేఖలో పేర్కొన్నారు. సోనియాగాంధీకి రాసిన లేఖలో తాను సమావేశానికి హాజరుకాకపోవడాన్ని వివరించానని, రేవంత్ తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించడంతో పాటు ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. చండూరులో మీటింగ్, చెరుకు సుధాకర్ జాయినింగ్స్ తనకు సమాచారం ఇవ్వలేదన్నారు.

Tags:    

Similar News