కాలుష్యంలో ఢిల్లీతో పోటీ!

వాయు కాలుష్యం మహమ్మారి మళ్లీ హైదరాబాద్ నగరంపై ప్రతాపం చూపుతోంది.

Update: 2023-06-13 03:24 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వాయు కాలుష్యం మహమ్మారి మళ్లీ హైదరాబాద్ నగరంపై ప్రతాపం చూపుతోంది. మూడేళ్ల క్రితం కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా భారీగా తగ్గిన కాలుష్యం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది . గ్రేటర్ లో వాయు కాలుష్యం ఇప్పుడు ఢిల్లీతో పోటీ పడుతోంది. దక్షిణ భారతంలో కాలుష్యం వెదజల్లే ప్రధాన నగరాలలో హైదరాబాద్ తొలిస్థానంలో ఉంది. గ్రీన్ పీస్ ఇండయా తాజా అధ్యయనంలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి . వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీనికి కారణం మోటారు వాహనాలు వెదజల్లుతున్న పొగలే అని గుర్తించారు. వాహనాల నుండి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ పెద్ద మొత్తంలో వెలువడుతున్నట్లు నిపుణులు వెల్లడించారు.

దక్షిణ భారత్‌లో మొదటి స్థానం

కాలుష్య భూతం కోరల్లో చిక్కుకుని హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. రోజు రోజుకూ నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోయి గాలిలో నాణ్యత తగ్గిపోతోండగా దక్షిణ భారత దేశంలోనే అతి ప్రమాదకరమై స్థాయిలో వాయు కాలుష్య నగరాలలో భాగ్యనగరం మొదటి స్థానంలో ఉంది . ఇక్కడ నివాసముంటున్న ప్రజలు ప్రతి రోజు కాలుష్యమైన గాలి పీలుస్తూ అనారోగ్యానికి గురౌతున్నారు. గ్రీన్ పీస్ ఇండియా అనే సంస్థ 365 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసి భాగ్యనగరంలో గాలి ఎంత ప్రమాదకరంగా మారిందనేది ప్రకటించింది . ఫలితంగా గాలి కాలుష్యం గ్రేటర్ ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. నెల వారిగా సగటు 2.5 యూజీ /ఎం3 కి బదులు గా 40.91 యూజీ/ఎం3గా నమోదైంది . భాగ్యనగరం తర్వాతి స్థానాలలో బెంగుళూరు 29.01 యూజీ/ఎం3, చెన్నై 23.81 యూజీ/ఎం3 గా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు గాలి కాలుష్యాన్ని లెక్కిస్తే గరిష్టంగా 102.64 యూసీ/ఎం3 గా నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 15 యూజీ/ఎంజీ వద్ద ప్రజల ఆరోగ్యాలకు అంత గా ముప్పు వాటిల్లదు . అయితే హైదరాబాద్ లో 6.8 రెట్లు అధికంగా నమోదై ప్రమాద ఘంటిక లు మోగిస్తోంది. నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్య స్థాయిల విషయానికి వస్తే, 337 రోజుల వ్యవధిలో సగటు స్థాయిలు 17 యూజీ /ఎం3 వద్ద ఉన్నాయి .హైదరాబాద్ 53 రోజులలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలను నమోదు చేసిందని సంస్థ ప్రకటించింది .
వాహనాలతోనే...

నగరంలో ఇటీవల కాలంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వాహనాల నుండి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్‌తో వాయుకాలుష్యం తీవ్రరూపం దాలుస్తూ ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది . మరోవైపు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా అతిసూక్ష్మ ధూళికణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ( సీపీసీబీ) ప్రమాణాల ప్రకారం గాలిలో 40 మైక్రో గ్రాములు మించకూడదు. కానీ పరిస్థితులు అందుకు బిన్నంగా ఉన్నాయి. రవాణా శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారించడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. వాయు కాలుష్యం మానవాళి మనుగడకు తీవ్ర ప్రమాదమని తెలిసినా దాని నియంత్రణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు .

గాలిలో క్షీణిస్తున్న నాణ్యత...

హైదరాబాద్‌‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది . ఫలితంగా ప్రజలు పలు రకాల జబ్బుల భారిన పడుతున్నారు . నగరంలో కొద్ది రోజులుగా వాయు కాలుష్యం స్థాయి పెరుగుతూ వస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ వాయు కాలుష్య ప్రభావం మాత్రం పెరుగుతూ వస్తోంది. ఇదిలాగే కొనసాగితే రాబోయే చలికాలంలో నగర ప్రజలు ఆరోగ్యంపై పెను ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు . నవంబర్ నుండి జనవరి మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి, ఇలాంటి పరిస్థితుల్లో గాలి నాణ్యత మరింత క్షిణిస్తుంది, ఈ ప్రభావం పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారిపై ఎక్కవగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరవాసులను ఇప్పడు ఈ భయం వెంటాడుతోంది.

Tags:    

Similar News