Compensation: అన్నదాతలకు బిగ్ రిలీఫ్.. వారందరికీ సర్కార్ నష్ట పరిహారం!
ఎండల తీవ్రత, భూగర్భజలాలు అడుగంటడం, నీటి కొరత నేపథ్యంలో పలు చోట్ల వరి పంట ఎండిపోతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎండల తీవ్రత, భూగర్భజలాలు అడుగంటడం, నీటి కొరత నేపథ్యంలో పలు చోట్ల వరి పంట ఎండిపోతున్నది. పశువులకు మేతగా మారుతున్నది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పరిహారం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ మేరకు పంటల వివరాలు సేకరించాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి, గ్రామాలు, క్లస్టర్లవారీగా ఎండుతున్న పంటల వివరాలు పంపించాలని రెండు రోజుల క్రితం మండలాధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో నీటి వసతులు, వరి సాగు తదితరాలపై వివరాలను సేకరించి గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వనున్నారు. క్షేత్ర స్ధాయిలో సర్వే తరువాత పంటలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పెరిగిన సాగు విస్తీర్ణం
సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇవ్వడంతో ఈ సీజన్ లో పెద్ద మొత్తంలో వరి విస్తీర్ణం పెరిగింది. యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 45 లక్షల ఎకరాల్లో వరి పంటనే వేశారు. గత యాసంగి పోలిస్తే దాదాపు 8 లక్షల ఎకరాలు అదనం. దీంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయనే చర్చ జరుగుతున్నది. గతేడాది అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ. 10 వేల పరిహారం ఇచ్చి ఆదుకున్నది. అదే తరహాలో యాసంగిలో పంటలు ఎండిన రైతులకు ఆదుకునేందుకు ఎకరానికి రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు పరిహారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించినట్లు తెలిసింది. అన్నదాతల పట్ల నిర్లక్ష్యం చేస్తే వారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుందని, ముందస్తుగా ప్రకటన చేస్తే రైతు ఆత్మహత్యలు జరగకుండా నివారించవచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్టుల కింద సాగు చేసిన భూముల్లో చివరి ఆయకట్టులో పంటల ఎండినట్లు, అదే విధంగా బోరు బావుల కింద చాలా ప్రాంతాల్లో వేసి పంటలు ఎండిపోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పంటలు ఎండిపోకుండా చర్యలు
వేసవిలో నీటి కొరత కారణంగా వరి పొలాలు ఎండకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజినీర్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి లో సాగు చేస వరికు నీటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో అధికారులు ఎప్పటికప్పు డు భూగర్భ జలాల పరిస్థితులను అంచనా వేస్తున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులతోపాటు, నీటి పారుదల శాఖకు చెందిన డీఈఈ, ఏఈఈలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైతుల సమస్యలపై ఫోకస్పెట్టారు. అదే విధంగా విద్యుత్ అధికారులు సమన్వయంగా పని చేస్తూ పంట పొలాలు ఎండకుండా ఎక్కువ గంటలు కరెంటు సరఫరాకు చర్యలు చేపట్టారు. రైతులకు నీటిని పరిస్థితులకు అనుగుణంగా వాడుకునేలా పలు సూచనలు చేస్తున్నారు.