కమ్యూనిటీ బేస్‌డ్ కామెంట్స్.. BJP, కాంగ్రెస్‌లకు షాక్ తప్పదా?
ఎన్నికల వేళ పార్టీల స్టేట్ మెంట్స్ వివాదస్పదమవుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ పార్టీల స్టేట్ మెంట్స్ వివాదస్పదమవుతున్నాయి. సున్నిత అంశాలపై ముఖ్య నేతల కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సౌత్‌లో ఈ సారి పాగా వేయాలనుకుంటున్న బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా మోడీ-అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిన్న అమిత్ షా చేవెళ్లలో చేసిన కామెంట్స్ ఆ పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించిన అమిత్ షా వాటిని రద్దు చేస్తామనడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లయింది.
అయితే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఆ ఫలాలు అందేలా చూస్తామన్నారు. దీంతో ఈ మూడు వర్గాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో 2018 ఎన్నికల నాటికి 12.7 శాతం మంది ముస్లిం ఓటర్లున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 30 స్థానాలను వీరు ప్రభావితం చేస్తారు. అయితే తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ముస్లిం ఓటర్లు బీజేపీకి మరింద దూరమయ్యే ఛాన్స్ ఉంది. ముస్లింలకు కల్పిస్తామన్న 12 శాతం రిజర్వేషన్ అంశంలో బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
మరి తాజా వ్యాఖ్యలతో బీజేపీని రాష్ట్రంలో ప్రతిపక్షాలు కార్నర్ చేసి ముస్లిం ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే అవకాశం ఉంది. ఎంఐఎం సైతం అమిత్ షా వ్యాఖ్యలను ఎలక్షన్ క్యాంపెయిన్‌లో వాడుకోవడంతో పాటు తాజా కామెంట్స్‌ని బూచిగా చూపి ఓట్లు దండుకునే అవకాశం ఉంది. అయితే 2019లో మార్చి 15 న కరీంనగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన హిందూగాళ్లు, బొందుగాళ్లు కామెంట్స్ ఎంపీ ఎలక్షన్స్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాక కూతురు ఎమ్మెల్సీ కవిత ఓటమికి ఇది కూడా ఓ కారణంగా మారింది. ఆనాడు ఎంపీ సీట్లు సైతం బీఆర్ఎస్‌కు తగ్గాయి.
కర్ణాటకలో లింగాయత్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇక ఎన్నికల వేళ ‘లింగాయత్ సీఎం అవినీతి పరుడు’ అంటూ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను బస్వారాజు బొమ్మై ఖండిచారు. లింగాయత్ సమాజాన్ని సిద్ధరామయ్య అవమానించారని, గతంలో బ్రహ్మణ వర్గాన్ని కూడా ఆయన హేళన చేశారని సున్నిత అంశాన్ని లేవనెత్తారు. కర్ణాటకలో అతిపెద్ద సామాజికవర్గంగా లింగాయత్‌లు ఎన్నికల ఫలితాలను శాసిస్తారు. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉన్న ఈ సామాజిక వర్గం ఓటర్లు 224 నియోజక వర్గాల్లో 100 సీట్లలో ప్రభావం చూపుతారు.
కర్ణాటకను పాలించిన 23 మంది సీఎంలలో 10 మంది లింగాయత్ వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అలాంటి వర్గంపై తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా, సిద్ధరామయ్య వ్యాఖ్యలు ముస్లిం, లింగాయత్ కమ్యూనిటీల ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది మాత్రం చూడాల్సి ఉంది.
Also Read..
నేను ముసలోడిని అయిపోయా.. KTR ఇంట్రెస్టింగ్ కామెంట్స్