బిగ్ ట్విస్ట్.. ఒక్కటైన రాజయ్య, కడియం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మరీ..
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరనే విషయం మనంద
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరనే విషయం మనందరికీ తెలిసిందే. రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా నేతలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు. అవసరమైతే శత్రువుతో సైతం వెంటనే కలిసిపోతారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అలాంటి పరిణామమే ఒకటి చోటుచేసుకుంది. గత కొద్దికాలంగా శత్రువులుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న ఆ ఇద్దరి నేతలు ఒక్కటయ్యారు. వారెవరో కాదు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.
స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ కోసం రాజయ్య, శ్రీహరి ఏ రేంజ్‌లో విమర్శలు చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియా వేదికగా ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు దూషించుకున్నారు. నువ్వుంటే నువ్వు అవినీతిపరుడివంటూ ఆరోపణలు చేసుకున్నారు. కొద్దికాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ ట్విస్ట్ చోటుచేసుకుంది. అనూహ్యంగా ఇద్దరూ కలవడం ఆసక్తికరంగా మారింది.
రాజయ్య, కడియం శ్రీహరి ఒక్కటయ్యారు. ఒకే వేదికను పంచుకోవడంతో పాటు ఇద్దరూ కలిసి కూర్చునున్నారు. అంతేకాదు ఉప్పు నిప్పుగా ఉండే వీరిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. పాలకుర్తి మండలంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మండలంలో వల్మిడి సీతారాముల ఆలయం పున:ప్రతిష్టలో పాల్గొనేందుకు ఇద్దరూ ఒకేసారి వచ్చారు. ఈ సందర్బంగా వేదికగా ఇద్దరూ తారసపడ్డగా.. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. అనంతరం కొద్దిసేపటికే రాజయ్య సభా వేదిక దగ్గర నుంచి వెళ్లిపోయారు. వీరిద్దరు కలిసి మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.