డొనేషన్ పేరిట రూ.కోట్లలో వసూళ్లు! ‘జోసెఫ్’ స్కూల్‌ దోపిడీ దందా

విద్యా వ్యవస్థ కార్పొరేట్ ​వ్యవస్థలో బందీగా మారింది.

Update: 2023-03-27 03:49 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: విద్యా వ్యవస్థ కార్పొరేట్ ​వ్యవస్థలో బందీగా మారింది. నిరుద్యోగులు ప్రైవేట్ ​స్కూల్స్​ పెట్టుకోవాలంటే రూల్స్​, రెగ్యులరైజేషన్​ వర్తిస్తాయి. అనుమతులు వచ్చే వరకు అడ్మిషన్లు తీసుకోకుండా ఇబ్బందులు గురిచేస్తోంది. అదే పెట్టుబడిదారులు, చదవుతో సంబంధం లేని వ్యక్తులు లాభాల కోసం ఏర్పాటు చేసుకునే స్కూల్స్‌కు​ ఎలాంటి నిబంధనలు ఉండవు. ఈ విధంగా రంగారెడ్డి జిల్లాలో కార్పొరేట్​ విద్యా సంస్థలు పుట్టగొడుగులాగా ఏర్పాటవుతున్నాయి.

అలాంటి స్కూల్స్​ ఏర్పాటులో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిస్తారు. అదే నిరుద్యోగి అప్పులు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలకు విద్యాధికారులు భంగం కల్పిస్తున్నారు. కాసులిస్తే అన్ని మాఫీ అనే కోణంలో జిల్లా విద్యాశాఖ నడుస్తుందని జోరుగా ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్​ స్కూల్‌కు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టమవుతుంది.

ఏ ప్రతిపాదికన అనుమతినిచ్చారు...

సెయింట్​ జోసెఫ్ ​పబ్లిక్ ​స్కూల్​ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో భవన నిర్మాణం పూర్తి కాలేదు. గోడలు నిర్మించి వదిలిపెట్టారు. అలాంటి సమయంలో మున్సిపాలిటీ అధికారులు కేవలం ప్రొవిజనల్​ ఫైర్​ ఎన్​వోసీ మాత్రమే ఆ భవనానికి ఇచ్చారు. ఆ సర్టిఫికెట్​తో ఎలా అనుమతినిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పూర్తి స్థాయిలో భవనం కాకముందే అడ్మిషన్లు తీసుకునేందుకు జిల్లా, మండల విద్యాశాఖాధికారులు ఎలా పర్మిషన్​ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా కాసులతో రాజీపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఆ భవన నిర్మాణం పూర్తికాలేదని స్పష్టమైతుంది. జీ ప్లస్​2 మాత్రమే పూర్తిస్థాయిలో భవనం కాగా.. మిగిలిన రెండు ఫ్లోర్ల లోపల గోడలే ఉన్నాయని తెలుస్తోంది.

డీఈవో, ఆర్జేడీలు పొంతనలేని అనుమతులు..

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ మండలం పెద్ద ​అంబర్​పేట్​ మున్సిపాలిటీ పరిధిలోని కాల్వంచలో సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్​ స్కూల్‌ను నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్నారు. ఈ స్కూల్స్​కు అనుమతులు ఇవ్వడంలో జిల్లా విద్యాశాఖ, ఆర్జేడీలు తొందరపాటు వహించినట్లు స్పష్టమవుతుంది. జీప్లస్ ​బిల్లింగ్ 18.45 మీటర్ల ఎత్తులో ఉండే భవనానికి ప్రొవిజనల్ ​ఫైర్ ​ఎన్వోసీతో జిల్లా విద్యాశాఖ పీపీ నుంచి 7వ తరగతి వరకు అనుమతినిచ్చింది. అదేవిధంగా 6 మీటర్ల ఎత్తుకు తక్కువ భవనం ఉందని ఫైర్​ఎన్వోసీతో సంబంధం లేకుండానే 8వ తరగతికి ఆర్జేడీ అనుమతినిచ్చారు.

అక్యూపెన్సీ ఫైర్ ​ఎన్వోసీ లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు పీపీ నుంచి 7వ తరగతి వరకు 2022–2023లో, 2023–24కు ఆర్జేడీ అనుమతులిచ్చింది. ఈ అనుమతులపై చైల్డ్​ రైట్స్​ఫోరం ఆధ్వర్యంలో 2022 మే 2022న జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేస్తే 20వ తేదీన సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్​ స్కూల్‌ను సీజ్​చేశారు. కానీ అదే విద్యాశాఖ అధికారులు ఎలాంటి అక్యూపెన్సీ సర్టిఫికేట్​ లేకుండా వెనవెంటనే రీ ఓపెన్​ చేయడంపై అనుమానాలకు తావునిస్తుంది.

సేవా సంస్థ పేరుతో దోపిడీ..

జీవో 1, 1994కు విరుద్ధంగా స్కూల్​​ నడిపించడమే కాకుండా విద్యార్థుల వద్ద భారీ స్థాయిలో ఫీజులు వసూల్​ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సేవా చేస్తున్నాం. కార్పొరేట్​ స్థాయిలో విద్యను అందించేందుకు తోడ్పాడుతున్నామని సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్​ స్కూల్ యాజమాన్యం చెబుతున్నారు.

కానీ అందుకు విరుద్దంగా ఆ యాజమాన్యం స్కూల్ నడిపించడం గమనార్హం. ప్రతి విద్యార్థి వద్ద డోనేషన్​ పేరుతో రూ.61వేలు వసూల్​ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఈ స్కూల్​లో 1072 మంది విద్యార్థుల దగ్గర నుంచి ఇప్పటి వరకు రూ.6.54కోట్లు వసూల్​ చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీఈ – 2009 నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.

Tags:    

Similar News