CM Revanth: స్పోర్ట్స్ వర్శిటీలో అంత‌ర్జాతీయ ప్రమాణాలు

దేశవ్యాప్తంగానే క్రీడలన్నింటికీ తెలంగాణ రాష్ట్రం సెంటర్ పాయింట్‌గా ఉండాలని, ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Update: 2024-08-19 17:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగానే క్రీడలన్నింటికీ తెలంగాణ రాష్ట్రం సెంటర్ పాయింట్‌గా ఉండాలని, ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రీడా విభాగాలు, శిక్షణా సంస్థలన్నీ స్పోర్ట్స్ యూనివర్శిటీ పరిధిలోకి వస్తాయన్నారు. మొత్తం దేశం తరపునే యంగ్ ఇండియా బ్రాండ్‌గా తెలంగాణ గుర్తింపు తెచ్చుకునేలా మన విధాన నిర్ణయాలు ఉండాలన్నారు. రాబోయే ఒలంపిక్స్ పోటీల్లో పతకాలను సాధించడమే లక్ష్యంగా మన స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ కార్యాచరణగా ఉండాలని నొక్కిచెప్పారు. అన్ని క్రీడలకూ తగిన ప్రాధాన్యత ఉండాలని, ఆ దిశగా సమన్వయంతో ఆ శాఖ విభాగాలు సమిష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)లో ఏర్పాటు కానున్న స్పోర్ట్స్ యూనివర్శిటీపై రివ్యూ సందర్భంగా సీఎం రేవంత్ పై విధంగా మార్గనిర్దేశనం చేశారు.

యంగ్ ఇండియా తెలంగాణ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో ప్రతీ క్రీడ‌కు ప్రాధాన్యం ఉండాల‌ని, అన్ని ర‌కాల క్రీడల‌ను, క్రీడా శిక్ష‌ణ సంస్థ‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తేవ‌డ‌మే దీని ల‌క్ష్య‌మ‌ని సీఎం స్పష్టం చేశారు. మ‌న దేశంతో పాటు తెలంగాణ‌లోని భౌగోళిక ప‌రిస్థితులు, మ‌న శరీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడ‌లు ఏవో గుర్తించి, వాటిపై ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారిని గుర్తించి ఆయా క్రీడ‌ల్లో ప్రోత్స‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ద‌శాబ్దాల క్రిత‌మే ఆఫ్రో-ఏషియ‌న్ గేమ్స్‌, కామ‌న్‌వెల్త్ గేమ్స్‌ కు ఆతిథ్య‌మిచ్చిన‌ హైద‌రాబాద్‌ను భ‌విష్య‌త్తులో ఒలంపిక్స్‌ కు వేదిక‌గా మార్చాల‌న్నారు. హైద‌రాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వ‌హించ‌డ‌మే కాకుండా ప్ర‌తీ క్రీడ‌లో మ‌న క్రీడాకారులు ప‌త‌కాలు పొందేలా తీర్చిదిద్దాల‌న్నారు. మ‌న స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ క్రీడాకారులు విజేతల్లో క‌చ్చితంగా ఉండాల్సిదేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం నిపుణులైన శిక్ష‌కుల‌తో ట్రెయినింగ్, కోచింగ్ ఇప్పించాల‌న్నారు.

స్పోర్ట్స్ వర్శిటీలో అంత‌ర్జాతీయ ప్రమాణాలు:

రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని క్రీడా పాఠ‌శాల‌లు, అకాడ‌మీలు, క్రీడా శిక్ష‌ణ సంస్థ‌లన్నింటిని స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని సంబంధిత అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో మ‌న దేశ క్రీడాకారులు ఒలంపిక్స్‌ లో రాణించే షూటింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, అర్చ‌రీ, జావెలిన్ త్రో, హాకీకి ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత శిక్ష‌ణ ద్వారా ప‌త‌కాలు సాధించే అవ‌కాశాలు ఉన్న క్రీడ‌ల్లో శిక్ష‌ణ ఇప్పించాల‌ని సూచించారు. యూనివ‌ర్సిటీలో ఆయా క్రీడ‌ల్లో శిక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు కల్పించి వారికి అవసరమైన ఆహారాన్ని, శారీరక వ్యాయామ సౌకర్యాలను కల్పించాలన్నారు. స్పోర్ట్స్ వర్శిటీని అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దాల‌ని ఆదేశించారు.

ప్ర‌తి లోక్‌స‌భ సెగ్మెంట్‌లో క్రీడా పాఠ‌శాల‌ :

విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను, ఏ క్రీడ‌ల‌పై ఆసక్తి ఉన్నదో పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు గుర్తించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. అలాంటి విద్యార్థులంద‌రికీ ఆయా క్రీడ‌ల్లో శిక్ష‌ణ ఇచ్చేలా ప్ర‌తీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఆ పాఠ‌శాల‌ల్లో విద్యా బోధ‌న‌తో పాటే క్రీడల దిశగా విద్యార్థులను ప్రోత్సహించే కార్యాచరణ ఉండాలన్నారు. క్రీడ‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థుల‌కు వారికి న‌చ్చిన క్రీడ‌ల్లో పాఠశాలలోనే శిక్ష‌ణ పొందేలా నిర్ణయాలు ఉండాలన్నారు. ప్ర‌తిభ ఆధారంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో వ‌స‌తి క‌ల్పించి మ‌రింత ప‌దును తేలేలా శిక్ష‌ణ ఇప్పించాల‌న్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల స్థాయి నుంచే అందరి సహకారం అందాలన్నారు.

ఇతర స్పోర్ట్స్ స్కూళ్ళలో స‌మ‌గ్ర అధ్య‌య‌నం :

హైద‌రాబాద్‌లోని స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ దేశా క్రీడారంగానికి కేంద్ర బిందువుగా ఉండాల‌ని, అందుకోసం అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లనూ తీసుకోవాల‌ని ప్రభుత్వం భావిస్తున్నందున ఇటీవ‌ల ఒలంపిక్స్‌ లో ప‌త‌కాలు సాధించిన దేశాలు, క్రీడాకారుల వివ‌రాల‌ను సేక‌రించి, ఆయా క్రీడాకారులు ప‌త‌కాల సాధ‌న‌కు శ్ర‌మించిన తీరు, ఆయా దేశాలు వారిని ప్రోత్స‌హించిన తీరు, వారికి ఇచ్చిన శిక్ష‌ణ‌, ప్రోత్సాహం త‌దిత‌రాల‌పై అధ్య‌య‌నం చేసి స‌మ‌గ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ముఖ్య‌మంత్రి సూచించారు. ఇప్ప‌టికే స్కిల్ యూనివ‌ర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామ‌ని, స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ కూడా ఇదే ‘యంగ్ ఇండియా’ పేరును ఖ‌రారు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ కు కూడా యంగ్ ఇండియా పేరు పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి వెల్ల‌డించారు. యంగ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్రం ఒక బ్రాండ్‌గా మారాల‌ని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శ‌క్తిమంత‌మైన రాష్ట్రంగా గుర్తింపు పొంద‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లనూ చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

తెలంగాణతోనే కేన్స్ టెక్నాలజీ సంస్థ :

సెమీ కండక్టర్ల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేన్స్ టెక్నాలజీ సంస్థ తెలంగాయలోనే కొనసాగనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆ సంస్థ సీఈవో రఘు ఫణికర్ స్పష్టం చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23న కొంగరకలాన్‌లో కేన్స్ సంస్థ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్‌ను ప్రారంభించబోతున్నది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కేన్స్ కంపెనీ సీఈఓ రఘు ఫణికర్ సోమవారం సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ‘ఓశాట్‘ యూనిట్ ఇండియన్ సెమికండక్టర్ మిషన్ పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది. ఐఎస్ఎం అనుమతి రాగానే ఓశాట్ యూనిట్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని ఫణికర్ స్పష్టం చేశారని ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.

Tags:    

Similar News