Union Budget: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్

2024-2025 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం రేవంత్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో

Update: 2024-07-23 12:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం రేవంత్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించినట్లు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అనేక సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశామని.. స్వయంగా నేనే మూడు సార్లు ప్రధాని మోడీని కలిసి బడ్జెట్‌లో తెలంగాణకు వివక్ష చూపకుండా నిధులు కేటాయించాలని కోరారని తెలిపారు. తెలంగాణ విషయంలో పెద్దన్నగా వ్యవహరించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశానని.. కానీ ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేదించారని, మోడీ మనసులో తెలంగాణపై కక్ష ఉన్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

తెలంగాణ పొరుగు రాష్ట్రం ఏపీలో రాజధాని అమరావతికి, పోలవరం సహా అనేక ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఏపీకి నిధులు ఇస్తే మాకేమి అభ్యంతరం లేదని.. మరీ ఏపీ పక్కనే ఉన్న తెలంగాణ సంగతేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టం తెలంగాణకు వర్తించదా అని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కూర్చీ బచావో బడ్జెట్‌లా ఉందని.. కేవలం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు నిధుల వర్షం కురిపించి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. ఇది కేవలం క్విడ్ ప్రొకో బడ్జెట్ అని, ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన పార్టీలతో లాలూచీ పడిన బడ్జెట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Similar News