విద్యుత్‌పై నేడు సీఎం రేవంత్ సమీక్ష.. సీఎండీ ప్రభాకర్ రావు హాజరుపై ఉత్కంఠ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణపై వాడివేడి చర్చ జరిగింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణపై వాడివేడి చర్చ జరిగింది. ఈ విభాగం పనితీరుపైనా, విద్యుత్ డిస్కంల అప్పులపైనా లోతుగా చర్చ జరిగింది. ఆ శాఖ తరఫున హాజరైన అధికారులు సరైన వివరాలు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారంటూ ముఖ్యమంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విద్యుత్ విభాగంపై లోతైన సమీక్ష జరపాల్సి ఉంటుందని నొక్కిచెప్పిన సీఎం రేవంత్.. శుక్రవారం రివ్యూ మీటింగ్ జరపనున్నట్లు ఆ శాఖ అధికారులకు తెలిపారు. ఈ మీటింగుకు ట్రాన్స్ కో – జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును తీసుకురావాల్సిందిగా ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
ఇప్పటికే ఆ పదవికి ఆయన రాజీనామా చేసినందున దాన్ని ఆమోదించవద్దని కూడా స్పష్టం చేశారు. విద్యుత్ డిస్కంలు ఆప్పుల ఊబిలో కూరుకుపోయాయని, ఈ రంగం సంక్షోభంలో పడిందని, దీని వెనక పెద్ద కుట్ర జరిగిందన్న అనుమానాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు సిక్స్ గ్యారంటీస్‌లో ఒకటిగా ఉన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుపై చర్చ సందర్భంగా విద్యుత్ రంగం పనితీరు ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం విద్యుత్ రంగానికి సంబంధించిన వివరాలను క్యాబినెట్ సమావేశంలో మంత్రులు లేవనెత్తగా అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడం హీట్ పెరగడానికి కారణమైంది.
విద్యుత్ రంగంపై లోతైన సమీక్ష జరపాలని భావించిన సీఎం రేవంత్.. సమగ్రమైన వివరాలతో శుక్రవారం సచివాలయంలో జరిగే మీటింగుకు తీసుకురావాలని, సీఎండీ ప్రభాకర్ రావును సైతం పిలిపించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖలో సుమారు రూ. 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు చెప్పడంతో మిగిలిన మంత్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిసింది. విద్యుత్ డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయిన సంగతి విపక్షాలకు చాలాకాలంగా తెలిసినప్పటికీ ఆ లోతు ఎంత ఉందనేది ఇప్పటివరకూ ఆ శాఖ అధికారులు చెప్పకపోవడంతో బైటకు రాలేదు. ఫస్ట్ క్యాబినెట్‌లోనే అధికారులు ఈ విషయాన్ని వెల్లడించడంతో లోతైన సమీక్ష అవసరమని క్యాబినెట్ అభిప్రాయపడింది.
ఇంతకాలం ట్రాన్స్ కో జెన్ కో సంస్థలకు సీఎండీగా వ్యవహరించిన ప్రభాకర్ రావు మూడు రోజుల క్రితమే రాజీనామా చేశారు. ఆ రాజీనామాకు ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. రాజీనామాను ఆమోదించొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. రాజీనామా చేశానన్న కారణంతో ఈ సమావేశానికి ప్రభాకర్‌రావు గైర్హాజరవుతారా?.. లేక ఇంకా ఆమోదించలేదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశం మేరకు హాజరవుతారా?.. అనేది ఆసక్తికరంగా మారింది.
Read More..