హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా.. CM రేవంత్ ప్రకటన
సిద్దిపేటను 45 ఏళ్లు నుంచి పాపాల బైరవుల్లా మామ, అల్లుడు పట్టిపీడిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం సాయంత్రం నీలం మధుకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేటను 45 ఏళ్లు నుంచి పాపాల బైరవుల్లా మామ, అల్లుడు పట్టిపీడిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం సాయంత్రం నీలం మధుకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మామ కేసీఆర్, అల్లుడు హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చానని అన్నారు. ఈ సారి ఆరు నూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరి తీరాలని పార్టీ నేతలకు సూచించారు. మెదక్ గడ్డపై కాంగ్రెస్ గెలవబోతోంది అంటే అది కార్యకర్తల గొప్పతనమే అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో మెదక్‌కు అనేక పరిశ్రమలు కేటాయించారని గుర్తుచేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ వల్లే మెదక్‌కు అనేక పరిశ్రమలు వచ్చాయని అన్నారు. మెదక్ నుంచి ఇందిరా గాంధీ పోటీ చేశారని గుర్తుచేశారు.
రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకొని అక్రమంగా ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నోళ్లు కావాలా? ప్రజలకు మంచి చేసేవాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని అన్నారు. వెంకట్రామిరెడ్డి నగదు చూసి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. కలెక్టర్‌గా ఉండ వెంకట్రామి రెడ్డి వందల ఎకరాలు కొల్ల గొట్టారని అన్నారు. నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎలాగో.. కేసీఆర్ హయాంలో వెంకట్రామిరెడ్డి అలాగని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌కు చెందిన వెంకట్రామిరెడ్డిని మెదక్ అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు. మెదక్ బీఆర్ఎస్‌లో అభ్యర్థులే లేరా? అని ప్రశ్నించారు. సిద్దిపేటలో మీటింగ్ పెడితే ఎవరూ రారేమోనని మా నేతలు అన్నారు.. కానీ, ఈ జనాలను చూస్తే సిద్దిపేట గడీలు బద్దలు అవడం ఖాయంగా కనిపిస్తోందని సీఎం రేవంత్ అన్నారు.
Read More..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ గడువును పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం