సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు: మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.

Update: 2024-04-22 15:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి సాక్షిగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడని, రైతులను మభ్యపెట్టడమంటే.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఆయన తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణలో కాంగ్రెస్ మొదటి నుంచి బీసీలకు చేసింది శూన్యం అని మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీగా ఫైర్ అయ్యారు. గతంలో బీసీల కోసం అనంతరాం, పుట్టు స్వామి వంటి అనేక కమిషన్లు వేశారు తప్పితే ఆ నివేదికల ఆధారంగా కార్యాచరణ రూపొందించ లేదని విరుచుకుపడ్డారు.

బీసీ వ్యతిరేక విధానాల వల్ల పొన్నాల లక్ష్మయ్య కన్నీళ్లతో కాంగ్రెస్‌ను వీడారని, సీనియర్ నేత హన్మంతరావు సైతం కాంగ్రెస్‌లో అందోళనతో ఉన్నారని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటోందని అన్నారు. మాదిగలకు కూడా కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమని అర్థమైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికలు ఉన్నాయని ముదిరాజ్ వ్యక్తిని మంత్రిని చేస్తానని రేవంత్ కొత్త పల్లవి ఎత్తుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లోని బీసీ నాయకులంతా ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఇంకా ఎంతకాలం ఆ పార్టీలో అవమానాలు, ఇబ్బందులు పడుతారని ప్రభాకర్ సూచించారు.

Tags:    

Similar News