CM Revanth: ఆందోళన వద్దు.. బాధితులందరినీ ఆదుకుంటాం

మున్నేరు వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

Update: 2024-09-02 12:51 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: మున్నేరు వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తక్షణ సాయం కింద ప్రతీ కుటుంబానికి పది వేలు అందజేయనున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ నుంచి వచ్చిన సీఎం.. మొదట పాలేరు నియోజకవర్గంలోని నాయకన్ గూడెం చేరుకున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘురామ్ రెడ్డి, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకన్ గూడెం వద్ద దెబ్బతిన్న పాలేరు రిజర్వాయర్ అలుగులను, దెబ్బతిన్న రహదారులను, పంటపొలాలను పరిశీలించారు. రిజర్వాయర్ వద్దకు చేరుకుని కొతకు గురైన కాల్వను, మినీ హైడల్ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం కూసుమంచి మీదుగా ఖమ్మం చేరుకుని పోలేపల్లిలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని బొక్కలగడ్డ, మోతేనగర్ లో సీఎం పర్యటించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు.

బాధితులను ఆదుకుంటాం..

వర్షాల కారణంగా మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మున్నేరు వరదలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపాయని, వందల కుటుంబాలు సర్వస్వాన్ని కోల్పోయాని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణ సాయం కింద్ర పదివేలు అందజేస్తున్నట్లు, ప్రతీ ఇంటికీ నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలోనే నష్టాన్ని అంచనా వేసి అందరినీ ఆదుకుంటామని, తగిన పరిహారం అందజేస్తామని చెప్పారు. మున్నేరువాగు రిటైనింగ్ వాల్ కోసం 650 కోట్లు కేటాయించామని, పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.


Similar News