Savitribai: సావిత్రిబాయి పూలే ఆశయాలకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ నివాళులు
సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులు అర్పించారు.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వామిక పీడలపై పోరాడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే (Savitribai Phule) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి పూలే గారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న తరుణంలో మహిళా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇవాళ జూబ్లిహిల్స్ నివాసంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.
సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పూలే దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని పేర్కొన్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. సావిత్రిబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళల సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్దికి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను ఇటీవలే పూర్తి చేసిందని వివరించారు. వారి త్యాగానికి, కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా టీచర్లు సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. సావిత్రీబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి తదితరులు ఉన్నారు.