మత విద్వేషాలను రెచ్చగొడితే వదిలిపెట్టేది లేదు.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.

Update: 2024-10-21 07:49 GMT

దిశ, సిటీక్రైం: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని హెచ్చరచించారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నాడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోషామహల్ పోలీసు స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. సంఘ విద్రోహ శక్తులు చెడు ఆలోచనలతో ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిని దీటుగా ఎదుర్కొని తిప్పికొడతామని పేర్కొన్నారు. శాంతిభద్రతలను విఘాతం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని హెచ్చరించారు. ఇక ఈ సంఘటనపై పోలీసు దర్యాప్తు జరుగుతోందని, పోలీసులపై ఎలాంటి అనుమానాలు వద్దని, విచారణ నిష్పక్షపాతంగా కొనసాగుతుందని, దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని భరోసా ఇచ్చారు.

పోలీసులకు ఎల్లప్పుడూ అండగా ప్రభుత్వం:

ఖద్దర్, ఖాకీల విధులను సమాజం ఎప్పుడు నిశితంగా గమనిస్తుందని, అందుకే వారందరీకి ఆదర్శంగా ఉండేలా మనం పని చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం పోలీసులకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని మాటిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలతోనే ఉండాలి తప్ప.. క్రిమినల్స్‌తో కాదని, తప్పు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అలాగే బాధితులకు సహానంతో, ఓపికతో సహకరించాలని సూచించారు.

అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ట్రాఫిక్ నియంత్రణ

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అర్టిఫిషియల్ ఇంటిజెన్స్‌ను ఉపయోగించాలని సీఎం సూచించారు. దీని కోసం అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, ఇతర సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ క్రైం నేరాల నియంత్రణలో తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో అధికారులు దేశంలోనే నెంబర్ 1గా గుర్తింపు తెచ్చుకున్నారని పోలీసులను అభినందించారు. ‘‘ గత 10 ఏండ్లలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా విపరీతంగా పెరిగిందని, దానిని అరికట్టడంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూర్ అద్భుతంగా పనిచేస్తోంది. మన పోలీసుల పని తీరు దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అందుకే పక్క రాష్ట్రాల పోలీసులు కూడా తెలంగాణకు వచ్చి శిక్షణ పొందుతూ వారి నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. తీవ్రవాద, ఉగ్రవాద చర్యలను నియంత్రించడంతో మన రాష్ట్ర ఎస్ఐబి, గ్రేహోండ్స్, ఇతర పోలీసు విభాగాల నైపుణ్యాన్ని పక్క రాష్ట్రాల్లో కూడా ఫాలో అవుతున్నారు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్ట్‌‌ల ఆధారాంగా అనేక కేసులలో నిందితులు పట్టుబడ్డారు.’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు వ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు.


Similar News