SLBC సొరంగం పనుల పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రకటించిన కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పరిశీలనకు వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

Update: 2024-06-22 08:02 GMT

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పరిశీలనకు వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం దాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను కేటాయింపునకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారని తెలిపారు.

కాగా, నల్లగొండ జిల్లాలో 500 గ్రామాలకు తాగునీరు, 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. నాడు రూ.1925 కోట్లతో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు నేడు రూ.4 వేల కోట్లకు చేరింది. నల్లగొండ జిల్లా చందంపేట నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు 43 కిలోమీటర్ల సొరంగం పనులు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 33 కిలోమీటర్ల పనులు పూర్తి కాగా.. ఆ తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ రిపేర్లకు రావడం.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిసారి నల్లగొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పెండిండ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు మూడేళ్లలో పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని ఎస్ఎల్బీసీ సొరంగం పనులు విజిట్ చేయించి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. 


Similar News