CM Revanth Reddy: ఆర్టీసీపై రుణ భారం తగ్గించాలి: ఆర్టీసీపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని ఆ వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు, అప్పుల రీక‌న్‌స్ట్రక్షన్‌పై అధ్యయ‌నం చేయాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను

Update: 2024-09-10 16:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని ఆ వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు, అప్పుల రీక‌న్‌స్ట్రక్షన్‌పై అధ్యయ‌నం చేయాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంస్థపై రుణ‌ భారం త‌గ్గించాల‌ని సూచించారు. ఆర్టీసీపై స‌చివాల‌యంలో ఆయన మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వహించారు. మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని మ‌హిళ‌లు వినియోగించుకుంటున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజా అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాల‌న్నారు.

పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ప్రతిపాదిక చేసుకోవాల‌ని సూచించారు. మంత్రి మంత్రి పొన్నం ప్రభాక‌ర్ మాట్లాడుతూ.. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంతో ఇప్పటి వ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్రయాణం చేశార‌ని పేర్కొన్నారు. దీంతో మ‌హిళా ప్రయాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయ్యాయ‌ని తెలిపారు. 7,292 ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తోంద‌ని మంత్రి వివ‌రించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్రారంభం నుంచి వివిధ జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతోంద‌ని, అందుకు సంబంధించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌ను సీఎంకు అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్రజంటేష‌న్‌తో వివరించారు.

వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భ‌విష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు క‌లిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంతో ఆక్యుపెన్సీ రేటు పెర‌గ‌డంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబ‌ర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వ‌స్తోంద‌న్నారు. స‌మీక్షలో సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్‌ రెడ్డి, షాన‌వాజ్ ఖాసీం, ర‌వాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి వికాస్‌రాజ్‌, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


Similar News