తెలంగాణ పదేళ్లుగా నియంత పాలనలో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లుగా తెలంగాణ నియంత పాలనలో కొనసాగిందని, కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Update: 2024-09-17 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లుగా తెలంగాణ నియంత పాలనలో కొనసాగిందని, కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్‌ వేదికగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణ స్వరూపం బిగించిన పిడికిలి మాదిరి ఉంటుందని, పిడికిలి పోరాటానికి స్వరూపమని అన్నారు. తెలంగాణలో ఐదువేళ్లలాంటి కులాలు, జాతులు, మతాలు కలిసి ఉంటాయనే సందేశం ఈ గుర్తు మనందరికీ ఇస్తుందని పేర్కొన్నారు. ‘బిగించిన పిడికిలి కొండలనైనా పిడికిలి చేయగలదు. ఐక్యంగా, సమైక్యంగా ఉండే తెలంగాణకు ఆ పిడికిలికి ఉన్నంత శక్తి ఉంది. ఇది 4 కోట్ల ప్రజల పిడికిలి. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. పెత్తందార్లపై, నియంతలపై పోరాటానికి ఇది సంకేతంగా ఉండాలి.

గత 10 ఏళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయింది. ఆ బానిస సంకెళ్లను తెంచడానికి స్ఫూర్తి ఈ సెప్టెంబర్ 17వ తేదీ. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణను నియంత పాలన నుంచి విముక్తి కల్పిస్తామని ప్రజలకు చెప్పాం. గజ్వేల్ గడ్డపై 2021, సెప్టెంబర్ 17న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగించాం. 2022, డిసెంబర్ 3న తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించాం. మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే. అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలనా దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.


Similar News