ఆ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్ రెడ్డి
సూర్యాపేట జిల్లాలో జరిగిన వరద నష్టంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో జరిగిన వరద నష్టంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మోతె మండలం నామవరంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం.. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ.. పంట, ఆస్తి నష్టంపై అధికారుల నుంచి ప్రాథమిక నివేదిక తీసుకున్నట్లు తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, అధికారులతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని సీఎం హామీ ఇచ్చారు. అలాగే వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలా కాకుండా పంట నష్టం జరిగితే ఎకరానికి రూ.10వేల సాయం, పశువులు చనిపోతే రూ.50 వేల సాయం అందిస్తామని, ఒకవేళ ఎవరైనా ఇళ్లు కోల్పోతే వారికి తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. రక్షణ చర్యల కోసం ఇప్పటికే సూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా రూ.5 కోట్లు అందజేశామని వెల్లడించారు.
ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వరద ముంపు పరిస్థితిపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీలకు వివరించడంతో పాటు వారి నుంచి సహాయ సహకారాలు కూడా కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వరద నష్టాన్ని సమీక్షించడం కోసం ప్రధానిని స్వయంగా ఆహ్వానించానని చెప్పారు. రాష్ట్ర మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, 3 రోజుల నుంచి నిద్ర లేకుండా తాను కూడా సమీక్షలు నిర్వహిస్తున్నానని సీఎం రేవంత్ వివరించారు.
అధికారులు సమర్పించిన ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోందని, ఈ నష్టం నుంచి బయటపడేందుకు కేంద్రం తక్షణమే తెలంగాణకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తగిన నష్టపరిహారం అందించేలా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీ నేతలపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. అమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెడుతుంటే మరో పెద్దాయన ఫాంహౌస్‌లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లగలరు కానీ వరద బాధితులను పరామర్శించడానికి మాత్రం రాలేకపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్న ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. చివరిగా వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడింది. ఈ వర్షం కారణంగా సాగర్ ఎడమకాలువ తెగి భారీగా పంట నష్టం జరిగింది.