తెలంగాణలో సైలెంట్ ఏపీలో దూకుడు.. CM KCR వ్యూహం ఇదే!

ఏపీపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టారు. దీంతో సంక్రాంతి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు స్తబ్దంగానే ఉండనున్నాయి.

Update: 2023-01-08 23:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టారు. దీంతో సంక్రాంతి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు స్తబ్దంగానే ఉండనున్నాయి. పక్కా రాష్ట్రంలో పార్టీ కమిటీలు పూర్తయ్యేవరకు, బహిరంగసభ తేదీలు ఖరారు అయ్యేవరకు బిజీ కానున్నారు. అంతేకాదు ఆ రాష్ట్రంలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. పండుగ తర్వాత తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయనున్నారు.

బీఆర్ఎస్ గా మార్చి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో ఆ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించలేదు. స్తంభించాయి. ఇంతకు ముందు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా సాగాయి. అయితే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కార్యక్రమాలు సైతం మందగించాయి. పార్టీ నేతలకు సైతం ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు. కేవలం చెక్కుల పంపిణీతో మమ అనిపిస్తున్నారు. అధినేత కేసీఆర్ అంతా ఏపీపైనే దృష్టిసారించారు. పార్టీ పేరు మార్చిన దగ్గరనుంచి ఏపీకి చెందిన నేతలు... గతంలో కేసీఆర్ పరిచయం ఉన్న నేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. పార్టీలోకి వస్తే రాబోయే కాలంలో భవిష్యత్ పై భరోసా కల్పిస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లోని తాజా, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు వివిధ పార్టీల్లోని సీనియర్ నేతలతో తరచూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఏపీ భవన్ లక్ష్యంగా పావులు కదుపుతుండటంతో తెలంగాణపై దృష్టిని పూర్తిస్థాయిలో కేంద్రీకరించలేకపోతున్నారు. ఏపీలో జిల్లా, నియోజకవర్గ కమిటీలు పూర్తి స్థాయిలో వేసేలా ప్రణాళికలు ఇప్పటికే చేపట్టిన కేసీఆర్... బహిరంగసభ తేదీ సైతం త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడలోనే తొలిసభను నిర్వహించి విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తాచాటేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలోని ప్రధానపార్టీల్లోని ఉన్న సీనియర్ నేతలు, అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. వారు వస్తే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తూ పదవులను సైతం ఎరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సంక్రాంతి తర్వాత దూకుడు..

బీఆర్ఎస్ పేరుతో పార్టీ కార్యక్రమాలను సంక్రాంతి తర్వాత ముమ్మరం చేయనున్నారు. కంటివెలుగు పథకం, ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవనం, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, జాగ ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు, దళితబంధు ఇలా అన్ని సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ తో చేపట్టనున్నారు. అంతేకాదు గొర్రెల పథకం లబ్ధిదారులకు సైతం నగదు బదిలీని సైతం సంక్రాంతి తర్వాతే కార్యరూపం దాల్చనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటన్నింటితో ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. అంతేకాదు పెండింగ్ పనులకు సైతం నిధులు విడుదల చేసి, కొత్త అభివృద్ధి పనులకు సైతం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినా ప్రజలు కన్ ఫ్యూజ్ కావద్దని, ఇప్పుడున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ఎక్కడా ఆగిపోవనే భరోసాను కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. అందుకే బీఆర్ఎస్ తో పార్టీ కార్యక్రమాల షెడ్యూల్‌ను కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఇవ్వడంతో పాటు జిల్లాల పర్యాటనలకు శ్రీకారం చుట్టనున్నారు. పూర్తైన సమీకృత కలెక్టరేట్ భవనాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించి పార్టీ శ్రేణులకు సైతం శిక్షణ కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అంతేకాదు అడపాధడపా చేస్తున్న ప్రోగ్రాంలు సైతం నేతలు టీఆర్ఎస్ పేరుతో నిర్వహిస్తున్నారు. చేరికలను పురస్కరించుకొని సైతం టీఆర్ఎస్ పేరుతో ఉన్న గులాబీ కండువాలనే కప్పుతుండటం గమనార్హం.

Also Read...

తెలంగాణ గవర్నర్ తమిళిసై బదిలీ.. త్వరలోనే కొత్త వారి ఎంట్రీ! 

Tags:    

Similar News