కేటీఆర్ టీం vs కేసీఆర్ టీం.. వరంగల్‌లో ఆసక్తికర సమీకరణాలు!
ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ టీం వర్సెస్ కేటీఆర్ టీంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌ను నమ్ముకుని కొంతమంది, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ టీం వర్సెస్ కేటీఆర్ టీంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌ను నమ్ముకుని కొంతమంది, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా చెలామణి అవుతూ ఇంకొంతమంది, ఇద్దరిని మెప్పించే ద్విముఖ వ్యూహంతో మరికొంతమంది నేతలు ఉండటం గమనార్హం. పార్టీ అధినేత కేసీఆర్‌ను నమ్ముకుని ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల నుంచి ఈసారి బరిలో నిలవాలని భావిస్తున్న నేతలపై కేటీఆర్ నీళ్లు చల్లుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. తదనుగుణంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ధీటుగా ఎమ్మెల్సీలు, ఆశవహులు సన్నద్ధమవుతున్నారు. అదే సమయంలో కేటీఆర్‌కు సన్నిహితులుగా పార్టీ ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్‌ను నియోజకవర్గానికి రప్పించుకోవడం ద్వారా తమకే టికెట్ రాబోతోందన్న సంకేతాలు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ కొంత సక్సెసయ్యారనే చర్చ ఓరుగల్లు బీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ ప్రకటన తర్వాత కేసీఆర్ జరిపిస్తున్న సర్వేల్లో ఆశాజనకమైన ఫలితాలు రాలేదని తెలుస్తుండటం గమనార్హం.
చారిపై కేసీఆర్‌కు ప్రేమ.. గండ్రనే గెలిపించాలన్న కేటీఆర్
భూపాలపల్లి నియోజకవర్గం టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వర్సెస్ తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనచారి మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రిత భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభ వేదికగా సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకే టికెట్ అన్న సంకేతాలిచ్చారు. ఈ పరిణామం నియోజకవర్గ బీఆర్ఎస్‌లో తీవ్ర దూమారానికి, స్పష్టమైన చీలికను తెచ్చింది. కేటీఆర్ ప్రకటన తర్వాత కూడా ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తాను బరిలోనే ఉంటానన్న సంకేతాలను పంపుతున్నారు. ఉద్యమకాలం నుంచి వెంట నడుస్తున్న చారి అంటే కేసీఆర్‌కు ఎంతో అభిమానం. గండ్రకే టికెట్ అంటూ కేటీఆర్ నిండు సభలో ప్రకటించినప్పటికీ మధుసూదనాచారికి టికెట్ వస్తుందనే ఆశలోనే ఆయన అనుచరులున్నారు. అయితే మంత్రి కేటీఆర్ ప్రకటనతో గండ్ర రమణారెడ్డి ఎన్నికలకు ధీమాతో ముందుకెళ్తున్నారు.
ముత్తిరెడ్డికి కేసీఆర్ అభయం.. ఎమ్మెల్సీకి కేటీఆర్ ప్రొత్సాహం
జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధ్య పోరు కొనసాగుతోంది. ముత్తిరెడ్డిని మొదట్నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రొత్సహిస్తూ వస్తున్నాడు. కేసీఆరే నాకు దేవుడు అంటూ ప్రకటించి ముత్తిరెడ్డి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన స్థానానికి ఎసరుపెడుతున్నాయి. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా చెలామణిలో ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఇక్కడి నుంచి బరిలో దింపేందుకు కేటీఆర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఎమ్మెల్సీ విస్తృతంగా బీఆర్ఎస్ నేతలతో టచ్‌లోకి వెళ్తుండటం విశేషం.
కవిత ధీమా వెనుక కేటీఆర్
మహబూబాబాద్ టికెట్ పోరులో ఎంపీ మాలోతు కవిత, సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కాకుండా ఎంపీ కవిత లేదా సత్యవతికి ఇక్కడి నుంచి అవకాశం కల్పించాలనే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఎంపీ కవితకు జిల్లా అధ్యక్ష పదవి లభించడంలో మంత్రి కేటీఆర్ చొరవ ఉందని తెలుస్తుండగా, వచ్చే ఎన్నికల్లోనూ ఆమెను అసెంబ్లీ బరిలో నిలిపేందుకు కేటీఆర్ ఆసక్తిగా ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. మానుకోట టికెట్ తనకే వస్తుందని, కేసీఆర్ తనపై కరుణ చూపుతాడని సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే తాజా పరిణామాలు మాత్రం ఆయనకు రుచిచడం లేదని సమాచారం. ఇక డోర్నకల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయడమే తన తొలి ప్రాధాన్యమని సత్యవతి రాథోడ్ ప్రకటించింది. రెడ్యా నాయక్‌పై అధినేత కేసీఆర్ విముఖత ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతుండగా, ఎలాగైనా తండ్రి రెడ్యానాయక్ స్థానాన్ని నిలిపే ప్రయత్నాలను కవిత మొదలుపెట్టినట్లుగా సమాచారం.
కేసీఆర్‌పై నాగుర్ల ఆశలు.. కేటీఆర్ వైపు నుంచి
పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటీఆర్ అండదండలుండగా, ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా ఈసారి న్యాయం చేస్తానన్న ఆశతో నాగుర్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కొద్దిరోజుల క్రితం కేటీఆర్ ప్రశంసలు కురిపించడం రాజకీయ మర్మంపై చర్చ జరుగుతోంది. త్వరలోనే పరకాలకు కేటీఆర్‌ను రప్పించి లైన్ క్లియర్ చేసుకోవాలని ధర్మారెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
తూర్పుపై కేటీఆర్‌కు టచ్‌లోకి నేతలు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్ ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభిమాని. కార్పోరేటర్‌స్థాయి నుంచి మేయర్, ఎమ్మెల్యే స్థాయికి చేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రాజకీయ జన్మనిచ్చారని పలుమార్లు వేదికలపై చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆశవహులు కేటీఆర్ వైపు నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
సర్వే రిపోర్టులో వినయ్‌కు వ్యతిరేక పవనాలంట..!
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగిందన్న సర్వేల నేపథ్యంలో అధిష్ఠానం అప్రమత్తమైంది. ఇక్కడి నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ పల్లా బరిలోకి దిగనున్నట్లు లీకులు వచ్చాయి. ఇటీవలి వరంగల్ పర్యటనలో వినయ్‌భాస్కరే మళ్లీ పోటీ చేస్తాడన్న విస్పష్టమైన ప్రకటనను కేటీఆర్ చేశారు. అయితే ఈ ప్రకటన తర్వాత కేసీఆర్‌కు చేరిన సర్వే రిపోర్టులో మాత్రం ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని తేలినట్లు సమాచారం. సర్వే రిపోర్టు ఆధారంగానే ఈ సారి టికెట్ల కేటాయింపు ఉంటుందని పలుమార్లు హెచ్చరంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు కేటీఆర్ ముందస్తుగా ప్రకటిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో ఖచ్చితంగా మార్పు ఉండబోతోందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.