బీఆర్ఎస్ విస్తరణలో సీఎం కేసీఆర్ ప్లాన్ చేంజ్!

బీఆర్ఎస్ లో చేరికలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ భవన్ వేదికగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు.

Update: 2023-02-18 01:59 GMT

బీఆర్ఎస్ విస్తరణలో సీఎం కేసీఆర్ ప్లాన్ చేంజ్ చేశారు. రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమించే బదులు అడహక్ కమిటీలను వేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ను నియమించాక వచ్చిన స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా స్టేట్స్ లో పార్టీ బలోపేతమైన తరువాతే రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ లో చేరికలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ భవన్ వేదికగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. మహారాష్ట్రలోని నాందెడ్‌ లో సభలోనూ మాజీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్నాటక, ఛత్తీస్ గఢ్ తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, ప్రజా, రైతు సంఘాల నేతలు కేసీఆర్‌తో భేటీ అవుతున్నారు. పార్టీ బలోపేతం, చేరికలపై ముమ్మరంగా చర్చిస్తున్నారు. అయితే ముందుగానే ఆయా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తే పార్టీకి నష్టమని భావించిన కేసీఆర్ అడహక్ కమిటీల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. యాక్టివ్ గా పనిచేసే నేతలను గుర్తించి ఆ తర్వాతే అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏపీతోనే ప్రణాళికలో మార్పు...

బీఆర్‌ఎస్‌ ఏపీ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ ను నియమించిన తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, మాజీలు, పెద్ద ఎత్తున నాయకులు చేరుతారనుకున్నారు. ఇతర పార్టీల్లోని నేతలను బీఆర్ఎస్ లోకి లాగేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అక్కడి నేతలతో మంతనాలు సాగించారు. తాజాగా ఎమ్మెల్యే వివేకానంద విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. కానీ ఆ స్థాయిలో అక్కడి నుంచి స్పందన రాలేదు. దీంతో కేసీఆర్ వ్యూహం మార్చినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాల విస్తరణకు అధ్యక్షులను కాకుండా అడహక్ కమిటీ ఏర్పాటు చేయాలనే భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చేరికల వేగం పెరిగిన తర్వాత సమర్థులైన నేతలకు ఆయా రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఒడిశా శాఖ అధ్యక్షుడిగా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌ ను నియమిస్తారని ప్రచారం జరిగినప్పటికీ నియమించలేదు. మహారాష్ట్ర, ఒడిషా శాఖలకు త్వరలో అడహక్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

అన్ని రాష్ట్రాల్లో సభలు!

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాక ఖమ్మం, నాందేడ్ లో సభలు నిర్వహించారు. ఈ నెల 25 తర్వాత భువనేశ్వర్ లోనూ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పెద్దసంఖ్యలో మాజీ ప్రజాప్రతినిధులను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News