దేశంలో తుఫాన్ రాబోతోంది.. దానిని ఎవరూ ఆపలేరు: కేసీఆర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని లోహాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

Update: 2023-03-26 10:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో త్వరలోనే రైతుల తుఫాన్‌ రాబోతున్నదని, దాన్నెవరూ ఆపలేరని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘కేసీఆర్‌కు మహారాష్ట్రలో ఎం పని అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అంటున్నారని, భారత పౌరుడిగా ప్రతి రాష్ట్రానికి వెళ్తా.. నేను భారతదేశ బిడ్డను’ అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర కాందార్‌ లోహలోని బైల్ బజార్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తరహా అభివృద్ధిని ఫడ్నవీస్ చేస్తే.. తాము రాము కదా అని అన్నారు. తెలంగాణ తరహా పథకాలు అమలు చేయనంతవరకూ మహారాష్ట్రకు వస్తూనే ఉంటామని ప్రకటించారు. తెలంగాణలో రైతుబంధు, 24 గంటలు కరెంటు అందజేస్తున్నామని, అంబేద్కర్‌ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నామని, రైతులకు రూ.5 లక్షల రైతుబీమా, పూర్తిగా పంట కొంటున్నామన్నారు. మహారాష్ట్రలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు దళితబంధు అమలు చేస్తే రానని కేసీఆర్ వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా పేదల బతుకులు మారలేదరన్నారు. ‘కాంగ్రెస్‌ 54 ఏళ్లు, బీజేపీ 16 ఏళ్లు దేశాన్ని పరిపాలించాయని అయినా బతుకులు మారాయా?. రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు ? నేను చెప్పేది నిజమో అబద్ధమో ఆలోచించండి’ అని ప్రజలను కోరారు.

అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి భారత్‌లో ఉందని ఏటా 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నిధులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరుగట్లేదు? మహారాష్ట్రలో సాగు, తాగునీరు చాలాచోట్ల అందుబాటులో లేదని, మన కళ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతుందని, ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు అని, మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం కేవలం రైతులకు రూ.6వేలు మాత్రమే ఇస్తుందని, రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదు. బతుకులపై ఆలోచన సభ అన్నారు.

మహారాష్ట్రలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని, స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని ప్రజలకు కేసీఆర్ పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి చూపుతామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగుర వేసేందుకు పార్టీ నేతలు పనిచేయాలని అన్నారు. ‘మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, మా ప్రాంతంలో సభ పెట్టాలని అనేకచోట్ల నుంచి కోరుతున్నారని, తర్వలోనే షోలాపూర్‌లో సభ నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచే నాయకున్ని ఎన్నుకుంటే మార్పు వస్తుందని, రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుందని పిలుపు నిచ్చారు. ఒక్క ఝలక్‌ ఇవ్వండి.. మొత్తం మారిపోతుందన్నారు. 24 గంటలు పని చేసే నాందేడ్‌ ఎయిర్‌పోర్ట్‌ను పగటికే పరిమితం చేశారని, దేశం ముందుకు వెళ్తోందా..? వెనక్కి వెళ్తోందా? అనేక మంది ఉద్యమకారుల జన్మభూమి మహారాష్ట్ర అని, మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదని ప్రజలకు ఇవ్వాలన్న మనసు పాలకులకు లేదని మండిపడ్డారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేతోపాటు కిసాన్‌ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మానిక్‌రావు కదం, మాజీ ఎమ్మెల్యే మనోహర్‌ పట్వారీ తదితరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Tags:    

Similar News