ఆ ముగ్గురి వల్లే ప్రస్తుతం భారత్ ఇలా ఉంది: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ జాతీయ జెండాను ఎగరేసి.. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ప్రత్యేకత ఉందని అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భావించామన్నారు. తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని.. ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి, గుండెలు ఎదురొడ్డి నిలిచింది తెలంగాణ సమాజమని అన్నారు. ఆనాటి ప్రజల పోరాటాలు జాతి గుండెల్లో నిలిచిపోతాయన్నారు.
తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందనన్నారు. న్యాయం, ధర్మం, కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆనాటి సామ్యానుల చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి నేతల వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక, తెలంగాణ సాధనతో నా జన్మ సాకారమైందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.