అప్పటికప్పుడా.. 6 నెలల ముందా.. అభ్యర్థుల ఎంపికపై డైలామాలో కేసీఆర్!
అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే నిర్వహించిన సర్వే రిపోర్టులను తెప్పించుకొని పరిశీలిస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే నిర్వహించిన సర్వే రిపోర్టులను తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. అయితే అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. షెడ్యూల్ వచ్చాక ప్రకటిస్తే ప్రచారానికి సమయం సరిపోతుందా అనే డౌట్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆరు నెలల ముందు అనౌన్స్ చేస్తే అసంతృప్తులు పెద్దఎత్తున పార్టీ వీడుతారనే భయమూ ముఖ్యమంత్రిని వెంటాడుతున్నది.
సిట్టింగుల్లో 30 మంది మైనస్!
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సుమారు 30 మందికి తిరిగి టికెట్టు వచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న వారికి మళ్లీ టికెట్ ఇస్తే గెలుపు కష్టమని కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్ని సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌లను పక్కన పెట్టక తప్పదని అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. విజయావకాశాలు ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉండే లీడర్లు చెబుతున్నారు. దీంతో కొందరు సిట్టింగ్‌లను పక్కన పెడతారే టాక్ మొదలైంది.
జంపింగ్‌కు రెడీగా బీఆర్ఎస్ లీడర్లు
టికెట్ రాకపోతే ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు చాలామంది బీఆర్ఎస్ లీడర్లు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పెద్ద లీడర్లతో మంతనాలు జరిపి, ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ లిస్టులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. టికెట్ ఇస్తే చాలు ఎన్నికలకు కావాల్సిన ఖర్చు తామే భరించుకుంటామని వివరిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా పలు చోట్ల విపక్షాలకు బలమైన అభ్యర్థులు దొరకడం లేదు. దీంతో బీఆర్ఎస్ లీడర్లను పార్టీలోకి చేర్చుకునేందుకు వారు రెడీగా ఉన్నారు.
ఆరు నెలలు ముందే ప్రకటిస్తే..?
అసెంబ్లీ అభ్యర్థులను ఆరు నెలల ముందుగానే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. దీంతో అభ్యర్థులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్న గ్రామాలపై స్పెషల్ ఫోకస్ పెట్టే చాన్స్ ఉంటుంది. మరోవైపు టికెట్ దక్కని లీడర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమైనా వారిని బుజ్జగించే టైమ్ దొరుకుతుందని భావిస్తున్నారు. ఇది ఒకవైపైతే అసంతృప్త లీడర్లకు సైతం ఫుల్ టైమ్ దొరికి, విపక్ష లీడర్లతో మాట్లాడి పార్టీ మారే ప్రమాదమూ ఉంటుంది. షెడ్యూల్ టైమ్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తులకు ఆలోచించే సమయముండదనే వాదనా లేకపోలేదు.
జులై తర్వాత ఎలక్షన్ షెడ్యూల్..?
జులై తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలును ఈసీ ప్రకటించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి 2024 జనవరి 16 వరకు ఉంది. సభ కాలపరిమితి కంటే ఆరు నెలల్లోపు ఎప్పుడైన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. 2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. దీంతో మిజోరాం, ఛత్తీస్ గఢ్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో కలిపి తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. అయితే మిజోరాం కొత్త అసెంబ్లీ 2023 డిసెంబరు 17లోపు ఏర్పాటు కావాల్సి ఉన్నది. అంటే డిసెంబరు 16లోపు ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలి. 2024 మే లోపు లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ సైతం పూర్తి చేయాలి. ఆరు నెలల్లోపే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను నిర్వహించడం ఇబ్బందవుతుందనే అభిప్రాయంలో ఈసీ ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే జులై తర్వాత ఐదు రాష్ట్రాలల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశమున్నదని ప్రచారం జరుగుతున్నది.