దేశ వైద్య విద్య చరిత్రలో తెలంగాణ సరికొత్త రికార్డ్: సీఎం కేసీఆర్

తెలంగాణ చరిత్రలో ఉజ్వలమైనటువంటి ఘట్టం. సువర్ణక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు.. రాష్ట్ర వైద్యరంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Update: 2023-09-15 16:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ చరిత్రలో ఉజ్వలమైనటువంటి ఘట్టం. సువర్ణక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు.. రాష్ట్ర వైద్యరంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్యాన్ని చేరువచేసే దిశగా ప్రతి జిల్లాకొక మెడికల్ కాలేజీ అనే లక్ష్యానికి చేరువలోకి తెలంగాణ రాష్ట్రం చేరుకున్నదన్నారు. ప్రగతి భవన్ నుంచి శుక్రవారం 9 నూతన మెడికల్ కాలేజీలను వర్చువల్ పద్దతిలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదు అన్నవారికి చేతల్లో చూపుతున్నామన్నారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ అనే లక్ష్యంలో భాగంగా నేటికి 26 మెడికల్ కాలేజీలకు చేరుకున్నామన్నారు.

రాబోయే అకాడమిక్ సంవత్సరంలో మరో 8 వైద్య కాలేజీలను ప్రారంభించుకోబోతున్నామన్నారు. 2014లో 2,850 వైద్య సీట్లు (ఎంబీబీఎస్ మాత్రమే) తెలంగాణలో ఉన్నాయని, నేడు 8,515 మెడికల్ సీట్లు తెలంగాణలో ఉన్నాయన్నారు. నీట్’కు పోను 85 సీట్లు తెలంగాణ బిడ్డలకు దక్కాలని విడుదల చేసిన జీవోపై వివాదం చెలరేగినా మంత్రి, వైద్యశాఖ సిబ్బంది పటిష్టమైన న్యాయపోరాటం చేసి హైకోర్టులో కూడా విజయం సాధించారు. ఇది గొప్ప విజయమని, రాబోయే సంవత్సరంలో ప్రారంభించబోయే 8 మెడికల్ కళాశాలలు, ప్రస్తుతమున్న 26 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయి కి ఎదుగుతున్నామన్నారు.

మనిషి ఆరోగ్యంగా, రోగ నిరోధక శక్తి కలిగి ఉండాలంటే తెల్ల కణాలు రక్తంలో ఏ విధంగా పనిచేస్తయో, తెలంగాణ ఉత్పత్తి చేసే తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థకు అదే పద్దతిలో పనిచేస్తారని, ఎవరికి సందేహం అవసరం లేదన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. పవర్ సెక్టార్, తాగునీటి రంగం, ఇరిగేషన్ ఇలా ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన విజయాలు సాధించామని, దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినామన్నారు.

ఒకనాడు గంజి కేంద్రాలు వెలసిన పాలమూరు జిల్లాలోనూ అద్భుతమైన అభివృద్ధి సాధించామన్నారు. పాలమూరు ప్రాజెక్టును కూడా ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. అటువంటి జిల్లాలో అద్భుతంగా 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఒక్క కాలేజీ లేని నల్గొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణలో లక్ష జనాభాలో 22 మంది ఎంబీబీఎస్‌లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇండియాలో ఏ రాష్ట్రం సాధించలేదన్నారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి అన్నారు. రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని కేసీఆర్ మార్గ నిర్దేశంలో గొప్ప విజయాన్ని సాధించామన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం అని, ఇది గొప్ప రికార్డు అన్నారు. దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయన్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని కేసీఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నదన్నారు. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని తెలిపారు. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. 

Tags:    

Similar News