ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: అయోమయంలో అధికార పార్టీ!
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి'లా మారింది ప్రభుత్వ పరిస్థితి. ఫాంహౌజ్ కేసు విచారణ సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు
దిశ,తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి'లా మారింది ప్రభుత్వ పరిస్థితి. ఫాంహౌజ్ కేసు విచారణ సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును విచారించేందుకు సీబీఐ రేడీ అయింది. కేసుకు సంబంధించిన పత్రాలను ఇవ్వాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఇదే విషయాన్ని శుక్రవారం హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసు విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో తెలియక కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్టు టాక్. కోర్టు ఆదేశాల మేరకు కేసును సీబీఐ అప్పగిస్తే పరువు పోతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.
మొదటికే మోసం?
ఫాంహౌజ్ వ్యవహారాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాలుగా ఉన్న వీడియోలను బయటపెట్టారు. అంతకు ముందే రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి లేదని జీవో జారీ చేశారు. తాజాగా కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించడంతో సర్కారు డైలమాలో పడింది. రాష్ట్రంలో ఏ సంస్థ విచారణ వద్దని సర్కారు జీవో జారీ చేసిందో.. ప్రస్తుతం అదే సంస్థకు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సంస్థకు చెందిన అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాల్సి ఉంది. అలాగే ఈ కేసులో ఇంతకాలం బాధితులుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీడియో సాక్ష్యాలను బహిరంగ పరిచినందుకు సీఎం కేసీఆర్‌నూ విచారించే చాన్స్ ఉంటుందని టాక్. దీంతో తాము పెట్టిన కేసులో తామే ఇరుక్కున్నామా? అని అధికార పార్టీ ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తున్నది.
ఏం చేద్దాం?
అధికార పార్టీ చాలా చాలెంజ్‌గా తీసుకున్న కేసును.. హైకోర్టు ఆదేశాల మేరకు విచారించేందుకు సీబీఐ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. సోమవారం వరకు ఆగాలని కోర్టు సూచించడంతో సీబీఐ అధికారులు మౌనంగా ఉన్నారు. కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లకుండా ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా? అప్పుడు కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చాయి? అనే విషయాలపై ఆరా తీసేపనిలో ఉన్నట్టు తెలిసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించలేమని ప్రభుత్వం నిరాకరిస్తే కోర్టు ధిక్కారణ అవుతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. కోర్టు ధిక్కారణ కింద రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ, లేదా చీఫ్ సెక్రటరీ చివాట్లు తినే ప్రమాదముందని వివరిస్తున్నారు.
ఎల్లుండి కీలకం
ప్రభుత్వం వేసిన అప్పీలుపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరి ఆ రోజు ప్రభుత్వం కోర్టు ముందు ఏం వాదనలు వినిపిస్తుంది అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ హైకోర్టులో ప్రతికూల తీర్పు వస్తే వెంటనే సుప్రీంను ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడ ఉపశమనం లభిస్తుందా? అనే కోణంలోనూ సీఎం కేసీఆర్ లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. సుప్రీం కోర్టులో పనిచేసిన న్యాయవాదులు, రిటైర్ట్ జడ్జీల సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
Also Read...