ఐదు రోజులుగా ఫాంహౌజ్‌లోనే KCR మకాం.. అసలేం జరుగుతోందంటూ బీఆర్ఎస్‌లో జోరుగా చర్చలు..!

కొత్త సెక్రటేరియల్ ప్రారంభించిన తర్వాత ఫాంహౌజ్‌కు వెళ్లడం తగ్గించిన కేసీఆర్.. ఎక్కువ సమయం హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు.

Update: 2023-07-19 02:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రటేరియల్ ప్రారంభించిన తర్వాత ఫాంహౌజ్‌కు వెళ్లడం తగ్గించిన కేసీఆర్.. ఎక్కువ సమయం హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. వీలైనప్పుడల్లా సెక్రటేరియట్‌కు వచ్చి అధికారులతో ఆయా శాఖలపై రివ్యూ నిర్వహిస్తున్నారు. మిగతా టైం ప్రగతిభవన్‌లో ఉంటున్నారు. ఎప్పుడైనా ఫాంహౌజ్‌కు వెళితే అదే రోజు లేదా మరుసటి రోజు తిరిగి వచ్చేస్తున్నారు. కానీ ఈ నెల 14న రాత్రి అక్కడికి వెళ్లిన గులాబీబాస్.. ఐదురోజులుగా అక్కడే ఉంటున్నారు. సుమారు రెండున్నర నెలల కాలంలో ఆయన వరుసగా ఐదు రోజుల పాటు అక్కడే మకాం వేయడం ఇదే మొదటిసారి.

మరి సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఏం చేస్తున్నారు? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారా? రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు ప్లాన్ వేస్తున్నారా? లేదంటే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ రోల్‌పై వ్యూహాలు రచిస్తున్నారా? అనే ఉత్కంఠ బీఆర్ఎస్ లీడర్లలో నెలకొంది. ఇన్ని రోజుల పాటు ఆయన అక్కడ ఉన్నారంటే పక్కాగా ఏదో పొలిటికల్ స్కెచ్ వేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికలతో పాటు, నేషనల్ పాలిటిక్స్‌లో పార్టీ రోల్‌పై వ్యూహాలు రచిస్తుంటారని ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉండే లీడర్లు అభిప్రాయాలు పడుతున్నట్టు టాక్.

నో అపాయింట్‌మెంట్..?

ఐదు రోజులుగా ఫాంహౌజ్‌లోనే ఉన్న సీఎం కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తున్నది. సహజంగా ఆయన అక్కడ ఎక్కువ రోజులు గడిపితే అవసరం మేరకు మంత్రులు, అధికారులను పిలిపించుకుని వివిధ అంశాలపై సలహాలు, సూచనలు చేస్తుంటారు. కానీ ఈసారీ అక్కడికి రావాలని ఎవరికీ కబురు పంపలేదని తెలుస్తున్నది.

అభ్యర్థుల కూర్పుపై ఫోకస్..?

ఆషాడ మాసం కారణంగా అభ్యర్థుల జాబితా ప్రకటించలేదని, ఇప్పుడు శ్రావణ మాసం రావడంతో తొలి జాబితా విడుదల చేసే పనిలో కేసీఆర్ నిమగ్నమైనట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రతి నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థుల బలబలాలపై విడివిడిగా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. సిట్టింగులు బలహీనంగా ఉన్న స్థానాల్లో కొత్త అభ్యర్థి కోసం ఇప్పటికే ఆరా తీయడం మొదలుపెట్టారు. 80 శాతం అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారని, అందుకు సంబంధించి ఫాంహౌజ్‌లో చివరి కసరత్తు చేస్తున్నారని టాక్.

మరో వైపు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు పెరిగింది. ఆ పార్టీ నిత్యం ఎదో ఒక పొగ్రామ్‌తో జనాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నది. దీంతో ఆ పార్టీని కట్టడి చేసేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ సీనియర్ లీడర్లను బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ఫామ్ హౌజ్ వేదికగా గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అక్కడి నుంచే పలువురు లీడర్లతో ఆయన మంతనాలు చేస్తున్నట్టు టాక్. దేశ రాజకీయాల్లోనూ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రతి రాజకీయ పార్టీ అటు ఎన్డీఏలో, లేదంటే ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కాని దేశంలో గుణాత్మక రాజకీయాలు తెస్తామని గొప్పగా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ కూటమిలో చేరలేదు. బీఆర్ఎస్‌తో కలిసి వచ్చేందుకు ఏ పార్టీ కూడా రెడీగా లేదు. మరి బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పాత్ర పోషించాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నట్టు ఆ పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు.

రెస్టు తీసుకుంటున్నారా..?

కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ జలుబుతో బాధ పడుతున్నట్టు సమాచారం. దీంతో ఆయన ఫాంహౌజ్‌లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారని, అందుకే హైదరాబాద్‌కు రావడం లేదని ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.


Similar News