బిగ్ న్యూస్: కవితను అరెస్టు చేస్తే ఏం చేద్దాం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై CM కేసీఆర్ ఫోకస్..?

మూడు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో పలువులు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీపై రాష్ట్రంలో చర్చలు ఊపందుకున్నాయి.

Update: 2023-02-25 02:08 GMT

ఇటీవల సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఎమర్జెన్సీ మీటింగ్‌పై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు.. ఇప్పటికే కవితకు సన్నిహితంగా ఉన్న బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశాయి. సమీప భవిష్యత్తులో కవితను అరెస్టు చేస్తే ఏం చేద్దామనే విషయంపై ఈ మీటింగ్‌లో ప్రధానంగా డిస్కస్ చేసినట్టు టాక్.

లీగల్‌గా ఫైట్ చేస్తూనే.. పొలిటికల్‌గా ఎలా ఎదుర్కోవాలనే ప్లాన్‌పై చర్చించినట్టు సమాచారం. మరో వైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత నేషనల్ ఇష్యూస్‌పై ఇటీవల విమర్శల జోరు పెంచారు. ఒక వేళ లిక్కర్ స్కాంలో అరెస్టయితే ఆ బ్లేమ్‌ను కేంద్రం మీదకు నెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేంద్రాన్ని విమర్శించినందుకే కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్టు చేశారని ప్రచారం చేసుకోవాలని కవిత భావిస్తున్నట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీపై రాష్ట్రంలో చర్చలు ఊపందుకున్నాయి. పార్టీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తున్నది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌‌రావు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎంపీ దామోదరరావు తదితరులతో జరిగిన ఈ ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఎక్కువ సమయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ విషయంపైనే చర్చించినట్టు తెలిసింది. సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు వేగాన్ని పెంచడంతో ఎప్పటికైనా కవితను విచారణ పేరుతో వేధించే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తున్నది.

ఈ విషయంపైనే ఈ భేటీలో విస్తృతంగా చర్చించుకున్నట్టు సమాచారం. మంత్రులు ముందుగానే రూపొందించుకున్న షెడ్యూలును విరమించుకుని అత్యవసర మీటింగ్‌కు హాజరుకావడంపై పార్టీ నాయకులకూ మింగుడుపడలేదు. మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా కవితను విచారణకు పిలిచి వేధిస్తున్నా, ఉద్దేశపూర్వకంగా ఆమెను అరెస్టు చేసినా ఆ ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉండనుంది? పార్టీ కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? రానున్న ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతున్నది? తదితరాల విషయాలపై విస్తృతంగానే చర్చించుకున్నట్టు తెలిసింది. లీగల్‌గా ఎలా ఫైట్ చేయాలి? రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి? ఫ్యామిలీతో పాటు కుటుంబ సభ్యులపై పడే ప్రభావం తదితరాలపైనా డిస్కస్ చేసినట్టు సమాచారం.

బీజేపీని ఢీకొట్టడం ఎలా?

పొలిటికల్‌గా కేంద్రంలోని బీజేపీని ఎలా ఢీకొట్టాలనే విషయంపైనా పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరంపైనా చర్చలు జరిగినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాన్నీ చర్చించినట్టు తెలిసింది. లిక్కర్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లు, అందులో సీబీఐ, ఈడీ లేవనెత్తిన అంశాలు, నిందితులపై మోపిన అభియోగాలు తదితరాలన్నింటిపై పార్టీ నేతల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. కవితను సీబీఐ ఒక సాక్షిగా గతేడాది డిసెంబరు 11న ప్రశ్నించడం సంచలనంగా మారింది.

అది ముగిసిన వెంటనే సీఆర్‌పీసీలోని సెక్షన్ 191 ప్రకారం మరో నోటీసు జారీ చేయడం చర్చకు దారితీసింది. ఆ తర్వాత వచ్చిన చార్జిషీట్లలో కవిత పేరును సీబీఐ, ఈడీ పదేపదే ప్రస్తావించడం, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఆరోపించడం, కిక్ బ్యాక్‌‌ల పేరుతో ముడుపులు ఇవ్వడం, వైన్ షాపులకు లైసెన్సులు పొంది లాభాలు ఆర్జించడం, పాలసీ రూపకల్పనలోనే కవితతో పలువురు చర్చలు జరపడం.. ఇలా అన్నింటిలో ఎమ్మెల్సీ ప్రమేయం ఉందన్న అనుమానాలను బలపరిచినట్లయింది. ఇప్పటికే కవితకు సన్నిహితంగా ఉన్న బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు తదితరులను ఇప్పటికే అరెస్టు చేయడంతో.. దర్యాప్తు సంస్థల నుంచి కవితకూ అలాంటి ముప్పు ఉంటుందని గులాబీ పార్టీలో గుసగుసలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.

సమీప భవిష్యత్తులో ఈ స్కామ్ దర్యాప్తు ఏ టర్న్ తీసుకుంటుందో, అది కవిత వరకూ ఎలా వస్తుందో, అరెస్టు లాంటి పరిణామాలు ఎదురైతే దాని ప్రభావం కుటుంబంపైనా, పార్టీపైనా, ఎన్నికలపైనా ఎలా పడుతుందో అనే గుబులు ప్రస్తుతం కేసీఆర్ స్థాయిలోనూ మొదలైనట్టు సీనియర్ నేతల ద్వారా తెలిసింది. ఊహించినట్టుగా అలాంటి పరిస్థితే ఎదురైతే ఒకవైపు లీగల్‌గా ఫైట్ చేయడానికి ఉన్న మార్గాలతో పాటు పొలిటికల్‌గా ఎదుర్కొనే వ్యూహం గురించి ఎమర్జెన్సీ మీటింగ్‌లో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది.

అందుకే కేంద్రం టార్గెట్‌గా..

ఇలాంటి పరిణామం జరుగుతుందని కల్వకుంట్ల కవిత ముందుగానే పసిగట్టినట్టున్నారు. గత కొన్ని వారాలుగా జాతీయ అంశాలనే ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక పార్టీగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అదానీ విషయంలో హిండెన్‌బర్గ్ రిపోర్టు, బడ్జెట్‌లో సంక్షేమానికి తగ్గిన ప్రాధాన్యం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు, ప్రత్యర్థి పార్టీలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం.. ఇలాంటివన్నీ కవిత జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారు.

ఎక్కువగా జాతీయ అంశాలనే ప్రస్తావిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపును తగ్గించి పేదల పొట్ట కొట్టడం లాంటివాటినీ హైలైట్ చేస్తున్నారు. చెన్నై, ముంబై నగరాల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే సదస్సులు, ప్రత్యేక ఇంటర్వ్యూలలో నేషనల్ ఇష్యూస్‌పైనే ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటివన్నీ ప్రస్తావిస్తున్నందునే సీబీఐ, ఈడీ లాంటి సంస్థల ద్వారా రాజకీయ కక్షసాధింపునకు పాల్పడి లిక్కర్ స్కామ్‌లో వేధిస్తున్నారని ముందుగానే గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News