మరోకోణం: ఉద్యమాలు ఓట్లు రాల్చవా?
తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ఎంత మాత్రం ఉద్యమ సంస్థ కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తరచూ గుర్తు చేస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ఎంత మాత్రం ఉద్యమ సంస్థ కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తరచూ గుర్తు చేస్తుంటారు. ఇలా పదే పదే చెప్పడంలో ఆయన ఉద్దేశం ఉద్యమ సంస్థకు ఉండాల్సిన లక్షణాలు, లక్ష్యాలు, వ్యూహాలు వేరని.. అవి రాజకీయ పార్టీకి వర్తించవని.. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో మొదట కొంత నెగెటివ్ టాక్ వచ్చింది కూడా. తెలంగాణ సెంటిమెంటుతో అధికారం దక్కించుకుని ముఖ్యమంత్రి కాగానే ఇలా ఉద్యమాన్ని మరిచి మాట్లాడుతున్నారని చాలా మంది విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను విస్మరించి పార్టీ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని, అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అయినప్పటికీ కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ఉద్యమ సంస్థను ఫక్తు రాజకీయ పార్టీగా మార్చే దిశలో ఏ అవకాశాన్నీ వదలలేదు. ఈ ఏడున్నరేళ్లలో ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని అనేక మంది నేతలను, ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్, టీడీపీల నుంచి, చివరకు వామపక్షాల నుంచి సైతం ఫిరాయింపులను ప్రోత్సహించారు. తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన కొండా సురేఖ, ఎర్రబెల్లి, తుమ్మల, దానం నాగేందర్ వంటి నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. వారిలో పలువురికి కీలక పదవులను అప్పగించారు. యూటీ(ఉద్యమ తెలంగాణ) బ్యాచ్ కంటే బీటీ(బంగారు తెలంగాణ) బ్యాచ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.
ఉద్యమ ప్రతిష్ట అన్నిమార్లూ ఓట్లు రాల్చదని, ఆకర్షణీయమైన హామీలు లేకపోతే ఈ రోజుల్లో విజయాన్ని గ్యారంటీ చేసుకోలేమని ఆయన గ్రహించారు. అమలుతో సంబంధం లేకుండా కుప్పలు తెప్పలుగా ప్రజలకు హామీలు ఇచ్చారు. వాటిలో చాలావరకూ నెరవేర్చకున్నా, కొన్నింటిని పాక్షికంగానే నెరవేర్చినా కొత్త హామీలు ఇప్పటికీ ఇస్తూనేవున్నారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి, ఆసరా పింఛన్ల పెంపు హామీలతో 2014లో గెలిస్తే, రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగభృతి హామీలతో 2018లో అధికారంలోకి వచ్చారు.
ఇక, ఓట్ల సమరంలో గట్టెక్కడానికి రాజకీయ పార్టీకి ఆర్థిక వనరులు కీలకమన్న విషయాన్ని గులాబీ అధినేత టీడీపీలో ఉన్నప్పుడే తెలుసుకున్నారు. సర్పంచ్ ఎన్నికలకు కూడా లక్షల్లో, కోట్లల్లో ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో ఒక పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడమంటే మాటలు కాదు. వేలాది కోట్ల రూ.లు ఉంటే కాని సాధ్యం కాదు. ఎంత మంచి లక్ష్యమున్నా, ఎంతటి ఆకర్షణీయమైన హామీలిచ్చినా, లెక్కకు మిక్కిలి ఉచితాలను ప్రవేశపెడతామన్నా.. ఓటుకు నోటు, మందు, విందు లేకపోతే ఏ పార్టీ అయినా పోల్ మేనేజ్మెంట్‌లో బొక్కబోర్లా పడడం ఖాయం. ఈ విషయాన్ని అందరికంటే ఎక్కువ నమ్మారు కనుకనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్‌ను ఆర్థికంగా పరిపుష్ఠం చేశారు. ఉద్యమకాలం నుంచీ ఆయన నిధుల సేకరణకు ప్రాధాన్యమిచ్చారని అప్పటి ఉద్యమ సహచరులు చెబుతుంటారు. తెలంగాణ శ్రేయోభిలాషుల నుంచి వందలాది కోట్లు సేకరించామని, ఉద్యమం కోసం ఖర్చు పెట్టామని వాళ్లు అంటుంటారు. రాష్ట్ర సాధన సాకారమై అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్థిక లక్ష్యాన్ని కేసీఆర్ మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారని, ఎన్ని ఎన్నికలనైనా అవలీలగా ఎదుర్కొనగలిగే సత్తాను సంపాదించుకున్నారని వాళ్లు ఢంకా బజాయిస్తున్నారు.
ఉద్యమసంస్థ చేయలేనివీ, చేయకూడనివీ అయిన ఈ లక్షణాలే టీఆర్ఎస్‌ను తెలంగాణలో రాజకీయంగా, సంస్థాగతంగా నిలబెట్టాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చాలా గ్రామాల్లో అసలు నిర్మాణమే లేని స్థితి నుంచి దాదాపు వంద శాతం గ్రామాల్లో పార్టీ శాఖలున్న, మిగతా పార్టీల కంటే పటిష్టంగా ఉన్న పరిస్థితి నేడు కనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీ నేతలుగా కొనసాగిన పలువురు ఇప్పుడు టీఆర్ఎస్ నేతలుగా కొనసాగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయి కలిగిన అభ్యర్థులు పలువురు ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింటుగా ఉంది. ఇక ఏ సభకైనా వేలల్లో, లక్షల్లో జనాన్ని ఇట్టే సమీకరించే శక్తిని కూడా పార్టీ సంతరించుకుంది. ఎన్నికలు వచ్చినప్పుడు బూత్ స్థాయిలో ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లగలిగే, వారిని ప్రభావితం చేయగలిగే కార్యకర్తల యంత్రాంగం, సమర్థమైన పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ కూడా ఇప్పుడు ఆ పార్టీ సొంతం. ఈ లక్షణాల మూలంగానే 2014లో కేవలం 63 స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ 2018లో 88 స్థానాలు గెలువగలిగింది. అనంతర పరిణామాల్లో మిగతా పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షమనేదే లేని పరిస్థితిని సృష్టించగలిగింది.
చరిత్రను పరిశీలించినా గొప్ప ఉద్యమాలు చేసి, లక్ష్యసాధనలో పరిపూర్ణంగానో, పాక్షికంగానో సఫలమైన అనేక పోరాట సంస్థలు ప్రధాన స్రవంతి పార్టీలుగా అనగా కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే ఫక్తు రాజకీయ పార్టీలుగా మారలేక అనతికాలంలోనే ఎన్నికల చదరంగంలో చతికిలపడిన ఉదంతాలు మన దేశంలో కోకొల్లలు. 1980లలో విదేశీ పౌరుల సమస్యపై అస్సాంలో ఐదారేళ్ల పాటు ఉద్యమం చేసిన అఖిల అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు).. ఆ తర్వాత అస్సాం గణ పరిషత్‌గా మారి మూడు దఫాలుగా అధికారం చేపట్టింది. అయితే, ఆ తర్వాతికాలంలో నిలదొక్కుకోలేక ఢక్కామొక్కీలు తిని ప్రస్తుతం ఓ చిన్న పార్టీగా మిగిలింది. మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన అనేక పోరాట సంస్థలు.. రాజకీయ పార్టీలుగా మారినా ఓటర్ల మెప్పు పొందలేకపోయాయి.
1970ల నుంచీ ప్రత్యేక జార్ఖండ్ కోసం పోరాడిన జార్ఖండ్ ముక్తి మోర్చా 2000లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019 వరకూ కేవలం రెండేళ్లకు పైబడిన కాలం మాత్రమే అధికారంలో ఉండింది. ప్రస్తుతం ఈ పార్టీయే పవర్‌లో ఉన్నా 81 సీట్లున్న సభలో కేవలం 30 సీట్లు సాధించి యూపీఏ తోక పార్టీగానే ప్రభుత్వాన్ని ఏర్పరచింది. రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతోంది. ఆర్థికంగా సమస్యల్లో ఇరుక్కుని చివరకు ఆ పార్టీ ఎంపీలు పీవీ హయాంలో అమ్ముడు పోవాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకుంది. ఇక ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా(సీఎంఎం) అయితే ఎన్నికల రాజకీయాల్లో ఇమడలేక దాదాపు కనుమరుగైపోయింది.
ప్రజాపోరాటాలు చేయడంలో దిట్టలుగా పేరొందిన వామపక్షాల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. ఒక్క సీపీఐ(ఎం) తప్ప మిగతా ఏ పార్టీ కూడా పార్లమెంటరీ రాజకీయాల్లో సఫలం కాలేదు. స్వాతంత్ర్యానంతర కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఆ తర్వాత క్రమంగా క్షీణించిపోతున్నాయి. ఈ పార్టీల పిలుపు మేరకు అనేక సమస్యలపై ధర్నాలకు, రాస్తారోకోలకు, సమ్మెలకు, సభలకు దండుగా, దండిగా వచ్చే జనం బ్యాలట్‌కు వచ్చేసరికి ఓటు వేయకుండా ప్రధాన పార్టీలనే ఆశ్రయించడం మనం చూస్తూనే ఉన్నాం. దళిత ఉద్యమాల నుంచి పుట్టిన బీఎస్పీ సైతం ప్రస్తుతం కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. యూపీ సహా పలు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయడంలేదు. ఇక ముస్లింల కోసం పని చేస్తున్నామని చెప్పుకునే పార్టీలకు ఆ వర్గం ఓటు బ్యాంకుగా మారిన దాఖలాలు కూడా చాలా తక్కువే. టీ-జేఏసీ నేతగా ఉంటూ ఊరూరూ తిరిగి ఉద్యమాలు చేసిన ప్రొ. కోదండరాం పెట్టిన టీజేఎస్ పార్టీ ఎన్నికల బరిలో బొక్కబోర్లాపడడం తాజా ఉదహరణ.
ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంతటి ప్రజాభిమానం సంపాదించినా అవి ఓట్లు రాలుస్తాయనే గ్యారెంటీ లేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. బ్యాలెట్ పోరాటంలో విజయం సాధించాలంటే ఇప్పుడు కావాల్సినవి.. ఒకటి: ఆకర్షణీయమైన, ప్రజలకు 'ఉచితాల'ను వాగ్దానం చేసే ఎన్నికల ప్రణాళిక. రెండు: కులాల, మతాల, వర్గాల వారీగా ఉన్న ఓటు బ్యాంకును కొల్లగొట్టగలిగే బలమైన అభ్యర్థులు. మూడు: సమర్థవంతమైన పోల్ మేనేజ్మెంట్. చివరి నిమిషంలో ఓటర్లకు తాయిలాలు అందించే సామర్థ్యం.
ఈ విషయాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు కనుకనే కేసీఆర్ టీఆర్ఎస్‌ను ఉద్యమ సంస్థగా ఉంచకుండా ఫక్తు రాజకీయ పార్టీగా మార్చివేశారు. ఓ వైపు సెంటిమెంటును వాడుకుంటూనే, ఎన్నికల ముంగిట వరాల వర్షం కురిపిస్తున్నారు. అవకాశవాద వైఖరితో ఏ పార్టీకి చెందిన వారినైనా అక్కున చేర్చుకుంటున్నారు. గెలిచే అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నా తమ పార్టీకి రప్పించే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఓట్లు రాబట్టడానికి, గెలువడానికి ఎంతటి ఖర్చుకైనా వెనుదీయని ఆర్థిక పరిపుష్ఠత సంపాదించుకున్నారు. మూడవ దఫా అధికారం చేపట్టడానికి అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కేసీఆర్ వ్యూహమే కరెక్ట్ అనిపిస్తోంది కదూ!