రేవంత్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నా: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీరియస్
రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు తగవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు తగవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.రేవంత్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో మంగళవారం నిర్వహించిన హాత్ సే హాత్ జోడో కార్నర్ మీటింగ్ సభపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడటం దారుణమన్నారు. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చిందన్నారు.
భౌతిక దాడులకు పాల్పడే సంస్కృతి ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు గ్రహించాలన్నారు. దాడులకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలపైన దాడి జరగడం శోచనీయమని పేర్కొన్నారు. అధికార పార్టీకి పోలీసులు పక్షపాతిగా వ్యవహరించినట్లు భూపాలపల్లిలో కాంగ్రెస్ సభపై జరిగిన దాడి కనిపిస్తున్నదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గ్రహించాలని సూచించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడం సమాజానికి మంచిది అని అన్నారు.