‘పది’ కేంద్రాల వద్ద 144 సెక్షన్.. విద్యార్థులకు ఉచితం ప్రయాణం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Update: 2023-03-29 17:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా అందుకు అనుగుణంగా 2,652 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో కలెక్టర్ల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 11 పరీక్ష పత్రాలను 6కు కుదించిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు సైతం ఎగ్జామ్ సెంటర్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లొద్దని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం చేసే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు దేవసేన తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News