కరోనా మృతులపై సర్కార్ కాకి లెక్కలు.. బులెటిన్ కంటే 7 రెట్లు ఎక్కువ!

Update: 2022-03-03 02:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా మరణాల అసలు లెక్క దొరికింది. ప్రభుత్వం ప్రతీ రోజూ చూపిస్తున్న సంఖ్య కంటే ఏకంగా 7 రెట్లు మరణాలు సంభవించినట్టు తేలింది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,111 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం అధికారిక హెల్త్​బులెటిన్‌లో పేర్కొన్నది. కానీ, కొవిడ్ మృతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 28,526 మందికి ఆమోదం ఇచ్చినట్టు​సర్కార్​స్వయంగా హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ద్వారా వాస్తవిక గణాంకాలు తేటతెల్లం అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22 వరకు నష్టపరిహారం రూ. 50 వేల కోసం కొవిడ్ మృతుల కుటుంబాలు 32,844 మంది దరఖాస్తు చేయగా అందులో 2,813 మందిని రిజెక్ట్​చేసినట్టు నివేదికలో తెలిపింది. మరో1,505 మంది అప్లికేషన్లను పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 28,526 మంది కొవిడ్ కారణంగా చనిపోయినట్టు ప్రభుత్వం పరిగణించడం గమనార్హం. హెల్త్​బులెటిన్‌లో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్టు దీని ద్వారా స్పష్టమవుతున్నది. కరోనా కేసులు, మరణాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ తప్పుడు లెక్కలే చూపిస్తున్నది.

40 శాతం మందికి అందని పరిహారం..

28 వేలకు పైగా దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. ఇప్పటికీ 40 శాతం మందికి డబ్బులు అందలేదని స్వయంగా ఆఫీసర్లే ఆప్​ది రికార్డులో చెబుతున్నారు. డిజాస్టర్​మేనేజ్‌మెంట్, హెల్త్ ఆఫీసర్ల మధ్య సమన్వయం లేకనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నట్టు ఆయా విభాగాల గ్రౌండ్​లెవల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిహారం నేరుగా అకౌంట్లలోనే జమ అవుతుందని అధికారులు స్పష్టం చేస్తుండటంతో చేసేదేమీ లేక బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వీరిలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు.

డెత్​సర్టిఫికేట్ల కోసం అవస్థలు

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్ల కోసం బాధిత కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. సరైన డాక్యుమెంట్లు లేనోళ్లు వాటిని సిద్ధం చేసుకునేందుకు మీ సేవా, హాస్పిటల్స్, గ్రామ స్థాయి ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్నారు. అంతేగాక మొదటి వేవ్ సమయంలో తమ సమ్మరీల్లో కరోనా డెత్‌గా రాయొద్దన్నోళ్లూ ఇప్పుడు ఎంట్రీ చేయాలని కోరుతుండటం విశేషం. ప్రైవేట్​ఆస్పత్రులకు ఇలా ఎక్కువ మంది వెళ్తున్నట్టు అధికారులే చెబుతున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కరోనా మృతుల నష్టపరిహారం కావాలంటే సదరు వ్యక్తి కొవిడ్‌తోనే చనిపోయినట్టు డెత్​సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. ఓడీఎఫ్‌సీ (అఫీషియల్ డాక్యుమెంట్ ఫర్ కొవిడ్ డెత్‌) పేరుతో ప్రత్యేక డాక్యుమెంట్‌ను అందజేస్తారు.

దీనిని తీసుకుని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దీని​కోసం గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ నుంచి తీసుకున్న డెత్ సర్టిఫికెట్‌తో పాటు పాజిటివ్ రిపోర్ట్‌ ఉండాలి. ఆ రిపోర్టు లేకపోతే ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఎంసీసీడీ (మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్‌) సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. అదీ లేకపోతే చికిత్స పొందిన సమయంలో తీసుకున్న స్కానింగ్‌లు, టెస్టులు, రిపోర్టులు, మెడికల్​బిల్లులు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలి. కానీ మొదటి, రెండో వేవ్‌లలో మరణించిన వారిలో ఎక్కువ మందికి సంబంధించి సరైన డాక్యుమెంట్లు లభించడం లేదు. దీంతో ఆస్పత్రులు, ఆఫీసర్ల చుట్లూ మృతుల కుటుంబాలు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. మరి కొందరు కలెక్టర్​కార్యాలయాల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేస్తున్నారు.

Clarity come on the number of Covid deaths in the state

Tags:    

Similar News